Ambulance Charges Surpasses Flight Tickets : ఫ్లైట్ టికెట్స్‌ను మించిపోయిన అంబులెన్స్ ఛార్జీలు
Ambulance charges Surpasses flight tickets : హైదరాబాద్‌లో అంబులెన్స్ ఛార్జీలు ఫ్లైట్ టికెట్స్‌ను మించిపోయాయి. కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న కొందరు అంబులెన్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. కేవలం ఐదే ఐదు కిలోమీటర్ల దూరానికి పది వేలకు పైగా ఛార్జ్ చేస్తున్నారు. దాంతో, ఆస్పత్రులకు వెళ్లేలోపే జేబులు గుల్లవుతున్నాయి.
ఒకవైపు కరోనా మహమ్మారి ప్రజలను బలి తీసుకుంటుంటే, మరోవైపు మానవత్వాన్ని మరిచిన కొందరు, దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా భయాన్ని ఆసరాగా తీసుకుని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు బిల్లుల మోత మోగిస్తుండగా, ఇదే అదునుగా అంబులెన్సుల నిర్వాహకులు కూడా నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని అంటున్నారు. కేవలం ఐదు కిలోమీటర్ల దూరానికే ఏకంగా పదివేల రూపాయలు వసూలు చేస్తూ రోగులను దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అర్ధరాత్రి, అపరాత్రి అయితే, ఇక వాళ్ల అరాచకానికి హద్దే ఉండటం లేదని అంటున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనాలు సకాలంలో రాకపోవడంతో ప్రజలు ప్రైవేట్ అంబులెన్సులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుంటున్నఅంబులెన్సుల నిర్వాహకులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని అంటున్నారు. అయితే, తాము నిబంధనల మేరకే ఛార్జీలు వసూలు చేస్తున్నామని అంబులెన్సుల నిర్వాహకులు చెబుతున్నారు. ఒకరిద్దరు చేసిన పనికి అందరినీ నిందించడం సరికాదని వాపోతున్నారు. తాము కూడా ప్రమాదకర పరిస్థితుల్లోనే పనిచేస్తున్నామని, అయితే పీపీఈ కిట్లు, శానిటైజర్ల కోసమే కొంత అదనంగా వసూలు చేస్తున్నామని చెబుతున్నారు.
ఏదేమైనా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అంబులెన్సులు సామాన్యులకు తలకు మించిన భారంగా మారిందని అంటున్నారు. అయితే, 108 వాహనాలను ప్రభుత్వం పెంచితే ప్రజలకు ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.