Nominated Posts: తెలంగాణలో మళ్లీ మొదలైన పదవుల పందేరం

Nominated Posts: తెలంగాణలో మళ్లీ పదవుల పందేరం జోరుగా సాగుతోంది.

Update: 2021-06-04 09:46 GMT

Nominated Posts: తెలంగాణలో మళ్లీ మొదలైన పదవుల పందేరం

Nominated Posts: తెలంగాణలో మళ్లీ పదవుల పందేరం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలతో పాటు త్వరలో ఖాళీ కానున్న గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం భారీగా పోటీ పడుతున్నారు. ఇందులో మండలి ఛైర్మన్‌ కూడా ఉండటంతో ప్రభుత్వం సిఫార్సు మేరకు ప్రొటెం ఛైర్మన్‌గా సీనియర్‌ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డిని నియమించారు. ఇందుకు వెంటనే గవర్నర్‌ ఆమోదం తెలపగా శాసనసభా కార్యదర్శి నర్సింహాచార్యులు నోటీఫికేషన్‌ కూడా జారీ చేశారు. ఆయన ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు.

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆగురురి ఎమ్మెల్సీల పదవీకాలం ముగిసింది. ఇందులో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, ఆకుల లలిత, ఫరీదుద్దీన్‌, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి ఉన్నారు. ఇప్పటివరకు మండలి ఛైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ పదవీకాలం ముగియడంతో ప్రొటెం ఛైర్మన్‌ నియామకం అనివార్యమైంది. దీంతో శాసనమండలి పునరుద్ధరణ అయినప్పటి నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సీనియర్‌ నేత భూపాల్‌రెడ్డిని ప్రొటెం ఛైర్మన్‌గా నియమించారు.

అయితే తెలంగాణలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలతో పాటు జూన్‌ 16 తర్వాత ఖాళీ కానున్న గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఈసారి ఆశావాహులు ఎక్కువ అనే చెప్పాలి. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారంతా ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాల కోసం తమకు ఉన్న అవకాశాలు, అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఇప్పటికే పార్టీలో అసంతృప్తులు పెరిగిపోయారు. వారందరికీ అవకాశం కల్పించి గౌరవిస్తామని, అందరికీ న్యాయం చేస్తానని గులాబీ బాస్‌ కేసీఆర్‌ అనేక సందర్భాల్లో హామీ ఇచ్చారు. అయితే ఆశావాహుల సంఖ్య భారీగా ఉండటంతో ఈసారి అభ్యర్థుల ఎంపిక అధినేతకు పరీక్షగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల కోసం పదవి ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహా పలువురు మరోసారి అవకాశం కోసం ఎదురుచూస్తుంటే వీరితో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ శాసనసభ్యులు కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, సీతారాంనాయక్‌, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, దేశపతి శ్రీనివాస్‌, కర్నె ప్రభాకర్‌, పిడమర్తి రవి, తుల ఉమ, తాడూరి శ్రీనివాస్‌, క్యామ మల్లేశంల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే వీరంతా ప్రయత్నాలు మొదలు పెట్టి అధినేతకు విన్నవించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఉద్యమంలో కేసీఆర్‌తో నడిచిన వాళ్లు ఈసారైనా అవకాశం లభిస్తుందని ఆశతో ఉన్నారు.

అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇప్పట్లో లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ప్రక్రియ వాయిదా పడటంతో నోటిఫికేషన్‌ ఎప్పుడనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ లెక్కన నోటిఫికేషన్‌ ఎప్పుడు వచ్చినా ప్రక్రియ పూర్తి కావడానికి మరో 6 నెలల సమయం పడుతుంది. దీంతో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానానికి గుత్తా సుఖేందర్‌రెడ్డిని భర్తీ చేసి మిగిలిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలను నోటిఫికేషన్‌ వచ్చాక భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Full View


Tags:    

Similar News