నాలుగేళ్ల చిన్నారి ప్రాణాన్ని బలితీసుకున్న నిర్లక్ష్యం, సెల్ఫీ మోజు...

TS News: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిరాల గ్రామంలోని ఫామ్‌ హౌజ్‌లో ఘటన

Update: 2022-03-19 05:49 GMT

నాలుగేళ్ల చిన్నారి ప్రాణాన్ని బలితీసుకున్న నిర్లక్ష్యం, సెల్ఫీ మోజు...

TS News: ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి తోడు పిల్లల సెల్ఫీల మోజు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఎయిర్‌గన్‌తో కాల్పులు జరపడంతో అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారి శాన్వి మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండ‌లం వావిరాల గ్రామంలో ప్రసాద్ అనే వ్యాపారవేత్తకు ఫామ్ హౌజ్ ఉంది. అందులో నాగ‌రాజు, సుక‌ణ్య దంప‌తులు వాచ్‌మెన్లుగా ప‌ని చేస్తున్నారు.

అయితే రెండు రోజుల క్రితం వాచ్‌మెన్ ఇంటికి బంధువులు వచ్చారు. వారిలో 17 ఏళ్ల మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. వాచ్‌మెన్ ఇంట్లో ఎయిర్‌గన్‌ను గమనించిన మైనర్ బాలుడు దాన్ని పట్టుకొని సెల్ఫీలు దిగాడు. ఈ క్రమంలోనే బాలుడు ఎయిర్‌ గన్ ట్రిగ్గర్ నొక్కడంతో అటుగా వెళ్తున్న నాలుగేళ్ల చిన్నారి శాన్వికి తగిలింది. దీంతో కాల్పుల్లో తీవ్రగాయాలైన చిన్నారి శాన్విని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా..చికిత్స పొందుతూ చనిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు..ఘటనా స్థలాన్ని పరిశీలించి పలు సెక్షన్ల కింద ఫాం యజమాని ప్రసాద్‌పై కేసులు నమోదు చేశారు.

ఫామ్ యజమాని ప్రసాద్..8 నెలల క్రితం ఆన్‌లైన్‌లో 26వేలు పెట్టి ఎయిర్‌గన్‌ను కొనుగోలు చేసినట్లు పటాన్‌చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి తెలిపారు. ఎయిర్ గ‌న్ ను ఆన్ లైన్ లో కొనుగోళ్లు చేశాడు. ఆ తర్వాత దానిని తన ఫామ్‌ హౌజ్‌లో నిర్లక్ష్యంగా పెట్టినట్లు తెలిపారు. ఫామ్ హౌజ్‌లో కోతుల బెడద ఉండడంతో ఎయిర్‌గన్‌ను కొనుగోలు చేసినట్లు యజమాని ప్రసాద్ పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలిసింది. ఎయిర్ గ‌న్‌కు ఎలాంటి లైసెన్స్ అవ‌స‌రం లేదన్న పోలీసులు..క్రీడాకారులు ప్రాక్టీస్ కోసం దానిని వాడతారని తెలిపారు.

అంతేతప్ప ఎవరు పడితే వారు ఎయిర్‌గన్‌ను వాడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫామ్‌ హౌజ్ యజమాని ప్రసాద్ నిర్లక్ష్యం వల్లే నాలుగేళ్ల చిన్నారి శాన్వి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మైన‌ర్ బాలుడితో పాటు ఫామ్ హౌజ్ య‌జ‌మాని ప్రసాద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వీరిద్దరిని రిమాండ్‌కు తరలించారు. స్టేట‌స్ సింబ‌ల్ కోసం ఎయిర్ గన్స్ వాడితే తాట‌తీస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి గన్స్‌ను తెచ్చి మనుషుల ప్రాణాలను తీయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News