రూపురేఖలు మారనున్న రాజన్న సన్నిధి
Vemulawada: యాదాద్రి తర్వాత.. వేములవాడపై సారించిన కేసీఆర్
Vemulawada: వేములవాడ రాజన్న సన్నిధి రూపురేఖలు మారబోతున్నాయి. ఇటీవల యాదాద్రి వైభవాన్ని సంతరించుకున్ననేపథ‌్యంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. యాదాద్రికి నమూనా అందించిన స్థపతి ఆనందసాయి... రాజన్న ఆలయరూపురేఖలను మార్చబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మాస్టర్ ప్లాన్ అమల్లోకి రాబోతోంది.
తెలంగాణ ప్రభుత్వం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి విషయం లో పనులు వేగవంతం చేయనుంది. ప్రముఖ ఆలయ స్థపతి ఆనంద్ సాయి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. సీఎం కేసీయార్ సూచన మేరకు అయన ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయ వేదపండితులు, వాస్తు నిపుణులు, ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆనందసాయితో కలసి మార్పు చేర్పులు, ఆలయ మాస్టర్ ప్లాన్ పై సుధీర్ఘంగా చర్చించారు. గర్భాలయకు ఎలాంటి ఆటంకం కలగకుండా పరిసరాలను ఆగమ శాస్త్రం ప్రకారం వాస్తు ఉండేలా నిర్మాణలు చేసేందుకు మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయనున్నారు. ఆనంద్ సాయి సూచనలతో యాదాద్రి ఆలయ రూపురేఖలు మార్చినట్లే... వేములవాడ రాజరాజేశ్వరుని సన్నిధిని తీర్చదిద్దబోతున్నారు.
ముందస్తుగానే వేములవాడ రాజన్నసన్నిధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించినప్పటికీ... తాజాగా ఆలయ నమూనాలో ఆకర్షణీయ మార్పులు చోటుచేసుకోనున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధి డిజైన్స్ బాధ్యత కూడా ఆనంద్ సాయి కి అప్పగించింది... ఈ నేపథ్యం లో వేములవాడ ప్రధాన ఆలయమైన రాజన్న ఆలయంతో పాటుగా ఉప ఆలయాలుగా ఉన్న బద్దిపోచమ్మ, నాగేంద్ర, భీమేశ్వర ఆలయాలను పరిశీలించారు. వేద పండితులు, ఆస్థాన వాస్తు నిపుణులతో ఆనందసాయి ఆలయ ప్రణాళి అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించారు.
వేములవాడ రాజన్న సన్నిధిలో వేదపండితులు, ఆగమశాస్త్ర నిపుణుల సలహాలు తీసుకున్న స్థపతి ఆనందసాయి.. ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు చేయబోతున్నట్లు స్పష్టత వచ్చింది. కాకతీయుల కళా వైభవం ఆలయ రూపకల్పనలో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆలయ రూపురేఖలు మార్చడంతోపాటు... భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచడం, భవిష్యత్తులో పెరిగే భక్తుల రద్ధీని అనుసరించి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించబోతున్నారు. క్యూలైన్లల్లో గంటల తరబడి వేచి ఉండే పరిస్థిలేకుండా సాంకేతిక ప్రమాణాలతో వ్యవస్థను ఆధునికీకరణ చేయనున్నారు. ఆలయ విస్తరణ లో భాగంగా నూతన ప్రాకారాల నిర్మాణం.. మండపాల నిర్మాణాలు, గాలిగోపురాలతో ప్రాకారాలు రూపుదిద్దుకోబోతున్నట్లు తెలుస్తోంది.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం సుముఖంగా ఉంది. నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి సిద్ధమైంది. ప్రతియేటా వందకోట్లరూపాయలను వెచ్చించేందుకు ప్రణాళికను సిద్ధంచేశారు. తాజాగా ఆలయ పునరుద్ధరణ పనులకు అంచనా వ్యయం రెట్టింపయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. గర్భాలయం , స్వామి వారి కోనేరు, ఆలయ ప్రాకారాలు సరికొత్త రూపును సంతరించుకోబోతున్నాయి.