Hyderabad: జోరుగా కల్తీ పాల విక్రయం.. యూరియా డిటర్జెంట్లు వాడి తయారు చేస్తున్న కల్తీ పాలు
Adulterated Milk: హైదరాబాద్‌కు అత్యంత దగ్గరగా ఉన్న ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక్కడి నుంచి నిత్యం హైదరాబాద్‌కు లక్షల లీటర్ల పాలు ఎగుమతి అవుతుంటాయి.
Adulterated Milk: హైదరాబాద్‌కు అత్యంత దగ్గరగా ఉన్న ప్రాంతం యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక్కడి నుంచి నిత్యం హైదరాబాద్‌కు లక్షల లీటర్ల పాలు ఎగుమతి అవుతుంటాయి. యాదాద్రి జిల్లాలో వేల కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇదే అదనుగా చేసుకున్న కొందరు అక్రమార్కులు... ఇదే ప్రాంతంలో పాల ఉత్పత్తి పేరుతో కల్తీ పాలు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రమాదకర రసాయనాలతో పాలను తయారు చేసి హైదరాబాద్‌లోని హోటళ్లు, స్వీట్ షాపులు, బేకరీ షాపుల్లో అమ్ముతున్నారు.
యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్, భూదాన్ పోచంపల్లి, వలిగొండ చౌటుప్పల్ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు నిత్యం పాల సరఫరా అవుతుంది. దీంతో కొంతమంది అక్రమార్కులు కల్తీ పాలు తయారు చేస్తూ కాసులు గడిస్తున్నారు. కల్తీ పాల తయారు చేయడానికి నీటిలో 5 కిలోల యూరియాను కలుపుతారు. దీంతో పాలు తెల్లగా మారుతాయి. దానికి 250 గ్రాముల డిటర్జెంట్, కొంచెం రిఫైండ్ ఆయిల్ కలుపుతారు. కెమికల్‌తో తయారు చేసిన పాల లాగ వాసన వచ్చే తెల్లటి పౌడర్‌ను కూడా మిక్స్ చేస్తారు. ఇలా తయారు చేసిన 40 లీటర్ల ద్రవంలో 60 లీటర్ల పాలు కలిపి 100 లీటర్ల కల్తీ పాలు తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన పాలను గుర్తించడం సామాన్యులకు అసాధ్యమనే చెప్పాలి.
అనేక రకాలుగా కల్తీ పాలు తయారు చేస్తున్నారు. 10 లీటర్ల పాలు ఉంటే వాటి నుంచి సగం పాలు తీసివేస్తారు. నీళ్లు, యూరియాతో పాటు సన్ ప్లవర్ ఆయిల్‌ను కలిపి దాన్ని మిక్సీ చేస్తారు. ఇలా తయారు చేసిన పాలు నిజమైన పాలకు ఏ మాత్రం తీసిపోవు. దీంతో వినియోగదారులు చిక్కటి పాలని అపోహ పడుతుంటారు. ఇలా తయారు చేసిన పాలను హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారు. ఇలాంటి పాలు తాగితే కాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రజలు పాలు కొనేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉంటే.. కల్తీ పాలను గుర్తించొచ్చని చెబుతున్నారు. ఈ కల్తీ పాలను గుర్తించడానికి పెద్ద పెద్ద పరికరాలేవీ అవసరం లేదు. ఇంట్లోనే చదునైన బండపై రెండు చుక్కల పాలను వేస్తే... అది మెల్లగా ఏదో వైపు పారుతుంది. ఇలా పారిన దారిలో తెల్లగా కనిపిస్తే అవి స్వచ్ఛమైన పాలు. కల్తీ పాలయితే తొందరగా పారి అవి పారిన దారిలో తెల్లగా కనిపించదు. ఇంతే కాకుండా మార్కెట్‌లో లాక్టో మీటర్ దొరుకుతుంది. దీని ద్వారా వెంటనే కల్తీ పాలను మనం గుర్తించొచ్చు.
పాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు సోడా, హైడ్రోజన్ పెరాక్సయిడ్ ఎక్కువ మోతాదులో కలుపుతున్నారు. వీటితో మెదడు నరాలు దెబ్బనడంతోపాటు జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. పలు డైరీ నిర్వాహకులు పాలు తయారు చేసేందుకు నాణ్యత లేని పాల పౌడర్ వాడుతున్నారు. ఇలా తయారు చేసిన పాలను చిన్న పిల్లలకు పట్టడం ద్వారా గ్యాస్ట్ర్రో ఎంటిరైటీస్‌తో పాటు వాంతులు, విరేచనాలు అవుతాయి. దీనిలో తయారయ్యే ఇకోలీ బ్యాక్టీరియా 70 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో మరిగించినప్పుడే అది చనిపోతుంది. లేదంటే దాని ద్వారా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
యాదాద్రిలో కల్తీ పాలు తయారు చేస్తున్న వారిపై పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నా తయారీ మాత్రం ఆగడం లేదు. తాజాగా బీబీ నగర్ లోని భూదాన్ పోచంపల్లి మండలంలో కల్తీ పాలు తయారు చేసే కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. కల్తీ పాల తయారీలో రైతుల ముసుగులో కొందరు అక్రమార్కులు ఉంటే.. చిన్న చిన్న డైరీ సంస్థలు కూడా ప్రమాదకర రసాయనాలతో పాలను తయారు చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
కల్తీ పాలు తయారు చేస్తూ అత్యాశతో ప్రజల బలహీనతను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. అనేక చోట్ల పోలీసులు అలాంటి వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇలాంటి వాటిపై పోలీసులు మరింత నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.