ఆదిలాబాద్‌ కాల్పుల ఘటన.. జమీర్‌ మృతి

Update: 2020-12-26 12:30 GMT

ఆదిలాబాద్​లో ఈ నెల 18న జరిగిన కాల్పుల ఘటనలో తీవ్ర గాయాల పాలైన సయ్యద్‌ జమీర్‌ హైదరాబాద్‌ నిమ్స్​లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తాటిగూడలో స్థానికంగా చిన్న పిల్లల మధ్య జరిగిన క్రికెట్​ గొడవ కాల్పులకు దారితీసింది. ఎంఐఎం నాయకుడు ఫారూఖ్​ ఒక చేత్తో కత్తితో వీరంగం సృష్టిస్తూ మరో చేతితో తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో జమీర్​కు రెండు తూటాలు దిగాయి. కత్తితో దాడి చేయగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి.

జమీర్​ను ముందుగా ఆదిలాబాద్ రిమ్స్​కు తరలించారు. పరిస్థితి విషమించడం వల్ల మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్​కు తీసుకెళ్లారు. మరుసటి రోజు శస్త్ర చికిత్స చేసి తూటాలు బయటకు తీశారు. అప్పటి నుంచి ఆరోగ్యం క్షీణించినట్టు మృతుడి బంధువులు తెలిపారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న సయ్యద్ జమీర్ ఇవాళ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదిలాబాద్​కు తరలించారు. తాటిగూడలో పోలీసు యంత్రాంగం ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేసింది.

కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు ఫారూఖ్‌ అహ్మద్‌ను ఈ నెల 18న అదుపులోకి తీసుకున్న పోలీసులు మేజిస్ట్రేట్​ ఎదుట హాజరుపర్చగా 14రోజుల రిమాండ్‌ విధించారు. కాల్పుల ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎంఐఎం అధినేత అసదుద్ధీన్‌ ఓవైసీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి ఫారూఖ్​ను తప్పించడమే కాకుండా పార్టీ నుంచి బహిష్కరించారు. ఘటనకు ప్రధాన సూత్రదారి అయిన ఫారూఖ్​తో పాటు అతనికి సహకరించిన అందరిని అరెస్టు చేయాలని సయ్యద్‌ జమీర్‌ బందువులు డిమాండ్‌ చేశారు. సయ్యద్ జమీర్ మృతితో ఆదిలాబాద్‌లోని తాటిగూడలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొన్నది. 

Tags:    

Similar News