తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ నాయకులు యత్నించారు. దీంతో ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్తున్న వారిని అడ్డుకునేందుకు లాఠీచార్జ్ చేశారు. విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా వచ్చిన విద్యార్థులను అసెంబ్లీ దరిదాపుల్లోకి రానివ్వకుండా అడ్డుకోవాలని పోలీసులు చూశారు.
ఐతే విద్యార్థులు మెరుపు వేగంతో దూసుకొచ్చారు. అసెంబ్లీ గేటు ఎక్కి దూకేందుకు కొందరు ప్రయత్నించారు. బారికేట్లను పక్కకు నెట్టేందుకు కొందరు ప్రయత్నించారు. ఆ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా మంది విద్యార్థులు అక్కడే బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఎంతకీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలు, విద్యార్థి నేతలపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.