Revanth Reddy: ఒకే విడతలో మొత్తం 2 లక్షల రూపాయలు రుణమాఫీ
Revanth Reddy: రైతు భరోసా పథకం విధి విధానాల కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు
Revanth Reddy: రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు.. 2 లక్షల రూపాయల వరకు రైతు పంట రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఒకే విడతలో మొత్తం 2 లక్షల రూపాయలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఐదేళ్ల మధ్య కాలంలో తీసుకున్న 2లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామన్నారు. క్రాఫ్ లోన్ మాఫీ చేయడానికి 31వేల కోట్లు అవసరం అవుతుందన్నారు. వ్యవసాయం దండగ కాదు.. పండగ అనుకునే విధంగా సాగు రంగాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు.
కొండలు, గుట్టలు, వెంచర్లకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా అందించటానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీథర్ బాబు, పొంగులేటి శ్రీనివాసు రెడ్డి సభ్యులుగా ఉంటారన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభలో చర్చించి.. నిర్ణయం తీసుకుని, జూలై 15లోపు నివేదిక అందిస్తామన్నారు.