హైదరాబాద్ ఘట్‌కేసర్ ఘటనలో కొత్త ట్విస్ట్
* ఘట్‌కేసర్‌లో బీ ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదు -సీపీ * యువతి చెప్పినదానికి తగిన ఆధారాల్లేవు -సీపీ మహేష్
ఎన్నో ట్విస్ట్‌లు, సంచలన విషయాల నడుమ సాగిన హైదరాబాద్ ఘట్‌కేసర్ ఘటనంతా ఉత్తుత్తేనని తేలిపోయింది. బీఫార్మసీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కథ.. కట్టుకథ అని స్పష్టమైంది. యువతి.. తన చిన్నపిల్ల మెంటాల్టీతో ఇదంతా చేసినట్టు బహిర్గతమైంది.
హైదరాబాద్ ఘట్‌కేసర్ ఘటనలో మరో కొత్త ట్విస్ట్ బయటపడింది. బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. యువతి పోలీసుల విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పిందని అన్నారు. అత్యాచారం జరిగినట్టు ఎలాంటి ఆధారాల్లేవన్నారు. తల్లి పోలీసులకు ఫోన్ చేయడంతో భయపడి.. ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేశారంటూ కట్టుకథ అల్లిందని వెల్లడించారు సీపీ.
ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవడం కోసమే విద్యార్థిని కిడ్నాప్ డ్రామా ఆడిందని తెలిపారు సీపీ. నిన్న రాత్రి యువతిని విచారించగా సంచలన విషయాలు బయటపెట్టిందని చెప్పారు. తనపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని యువతి చెప్పిందని, ఇంట్లో నుంచి వెళ్లిపోవడం కోసమే డ్రామా ఆడానని విద్యార్థిని ఒప్పుకుందన్నారు.
ఆటో డ్రైవర్లను అనుమానించినందుకు తనను క్షమించాలని కోరారు సీపీ మహేష భగవత్. విచారణలో భాగంగానే అనుమానించామని, ఆటో యూనియన్లు బాగా సహకరించాయని ఆయన అన్నారు. ఫైనల్‌గా ఘట్‌కేసర్ ఘటన ఓ ఫేక్ స్టోరీ అని స్పష్టం చేశారు సీపీ మహేష్ భగవత్.