Mahabubnagar: 106వ పుట్టినరోజు జరుపుకున్న ఓ బామ్మ
Mahabubnagar: పండుగలా వేడుక జరిపిన వారసులు
Mahabubnagar: కలియుగంలో సాటి మనిషి ఆయువు ఏడెనిమిది పదుల కన్నా మించి ఉండటం లేదు. మా అంటే మరో పదేళ్లు బ్రతికినా 90 ఏళ్లు. అలాంటిది మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ బామ్మ ఏకంగా 106వ పుట్టిరోజు చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె వారసులైన 186 మంది బామ్మను సన్మానించాలనుకున్నారు. ఇంకేముంది. ఒకే కుటుంబానికి చెందిన వారంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. పండుగలా వేడుక జరుపుకున్నారు. నూరేళ్లు పైబడిన వెంకటరమణమ్మకు ఘనంగా సన్మానం చేసి, రోజంతా ఆమెతో గడిపారు.
నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిర్సవాడ కాలనీకి చెందిన 106 ఏళ్ల వెంకటరమణమ్మ నేటికీ ఆరోగ్యంగా ఉన్నారు. తన పనులన్నీ తానే స్వయంగా చేసుకుంటున్నారు. 1914లో జన్మించిన ఈమెకు ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా కోడళ్లు, అల్లుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు, మునిమనవళ్లతో కలిపి 186 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే కరోనా కాలంలోనూ ఈ బామ్మ ఆరోగ్యంగా ఉండడం పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు.