తెలంగాణలో నామినేషన్ల పర్వం.. తొలిరోజు రాష్ట్రంలో 94 నామినేషన్లు దాఖలు
Nominations: కాంగ్రెస్ నుంచి 8మంది అభ్యర్థులు, బీజేపీ నుంచి ముగ్గురు నామినేషన్
Nominations: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలకు శుక్రవారం ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేశారు. తొలిరోజు రాష్ట్రంలో 94 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది అభ్యర్థులు, బీజేపీ నుంచి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి తొలిరోజు ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తరపున కొడంగల్‌లో ఆయన సోదరుడు నామినేషణ్ వేశారు. ఖమ్మంలో తుమ్మల, ముథోల్లో నారాయణపాటిల్, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ, ఆలేరులో బీర్ల ఐలయ్య, గోషామహల్ నుంచి మొగిలి సునీత, సిర్పూర్ నుంచి రావి శ్రీనివాస్ నామినేషన్ ఫైల్ చేశారు. బీజేపీ నుంచి వరంగల్ ఈస్ట్ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్, చేవెళ్ల అభ్యర్థి కేఎస్ రత్నం, బెల్లంపల్లి అభ్యర్థి శ్రీదేవి నామినేషన్ వేశారు. మిగిలిన నామినేషన్లలో అధికంగా స్వతంత్ర అభ్యర్థులవే ఉండగా.. కొద్దిచోట్ల బీఎస్పీ, ఆప్ అభ్యర్థులవి ఉన్నాయి.
నామినేషన్ అఫిడవిట్‌లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి అత్యధికంగా 124 కోట్ల ఆస్తులు అటాచ్ చేశారు. ముథోల్ కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావు పాటిల్ 67 కోట్లు.. బీర్ల ఐలయ్య 42కోట్లు, ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ 26 కోట్ల 96 లక్షల ఆస్తులను అటాచ్ చేశారు. తుమ్మల 17 కోట్లు, గండ్ర సత్యనారాయణ 11 కోట్ల 90 లక్షలు, కేఎస్ రత్నం 4 కోట్ల 84 లక్షల ఆస్తులున్నట్టు తెలిపారు.