ఆన్‌లైన్ ద్వారా 83 శిక్షణా కార్యక్రమాలు..
లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ ఆన్‌లైన్ శిక్షణ తరగతులు అధ్యాపకులకు, విద్యార్థులకు ఉపయోగపడుతాయని వరంగల్ నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు అన్నారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ ఆన్‌లైన్ శిక్షణ తరగతులు అధ్యాపకులకు, విద్యార్థులకు ఉపయోగపడుతాయని వరంగల్ నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు అన్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది 83 ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి ఆల్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (ఏఐసీటీఈ) ద్వారా అనుమతి లభించిందని ఆయన తెలిపారు. ఇప్పటికే నిట్ ను వేదికగా చేసుకుని అధ్యాపకులకు విశ్వ వ్యాప్తమైన సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించేందుకు ఆన్‌లైన్ శిక్షణ తరగతులను ప్రారంభించామని తెలిపారు. ఐదు రోజుల పాటు ఆన్‌లైన్ లో గోటూ మీటింగ్ యాప్ ద్వారా నిర్వహించే శిక్షణ తరగతులను డైరెక్టర్ ఎన్వీ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూఢిల్లీలోని ట్రైనింగ్ అకాడమీ సహకారంతో ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ శిక్షణను తీసుకునేందుకు దేశ వ్యాప్తంగా సుమారు రెండు వేల మంది రిజిస్టర్ చేసుకున్నారన్నారు. కానీ వారిలో కేవలం 200 మందిని మాత్రమే ఎంపిక చేసామని, వారికి సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆన్‌లైన్ శిక్షణను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. 6 అధ్యాపక శిక్షణలు కేవలం కంప్యూటర్ సైన్స్ విభాగం ద్వారా నిర్వహిస్తామని అన్నారు. అనంతరం సదస్సు కోఆర్డినేటర్ డాక్టర్ భూక్య రాజు మాట్లాడుతూ లాటరీ టికెట్, ఇన్‌కం ట్యాక్స్, క్రెడిట్ కార్డు మోసాలు, బ్యాంకింగ్ మోసాలు, ఆన్‌లైన్ షాపింగ్, ఓయల్‌ఎక్స్ దుర్వినియోగంపై ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి రాధాకృష్ణ, సురేష్ బాబు పాల్గొన్నారు.