అసెంబ్లీకి ఈసారి 10 మంది ఆడబిడ్డలు.. కాంగ్రెస్ నుంచి ఆరుగురు.. బీఆర్ఎస్ నుంచి నలుగురు
Telangana: 2018 ఎన్నికల్లో ఆరుగురు మాత్రమే.. తొలి ప్రయత్నంలో నలుగురు విజయం
Telangana: తెలంగాణ అసెంబ్లీలో మహిళల ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్ర అసెంబ్లీలో మహిళల ప్రాతినిథ్యం గతంలో కంటే మెరుగైంది. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళలే విజయం సాధించగా, ఈసారి పది మంది గెలుపొందారు. వీరిలో నలుగురు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా.. మరో ఆరుగురికి ఇదివరకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. మొత్తంగా కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.
హోరాహోరి పోరులో విజయం సాధించిన మహిళా సారధుల్లో ముగ్గురికి మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. ములుగు నుంచి సీతక్క మరోసారి విజయం సాధించారు. వైఎస్‌ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సునీతా లక్ష్మారెడ్డి, ఈసారి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నర్సాపూర్‌లో పోటీ చేసి గెలుపొందారు. మహేశ్వరం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి విజయం సాధించారు. వీరికి గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండటంతో.. శాసన సభలో సీనియర్లుగా వ్యవహరించనున్నారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ లీడర్ కోవ లక్ష్మి 22,798 ఓట్ల మెజార్టీతో మరోసారి గెలుపొందారు. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న చనిపోవడంతో, ఈ ఎన్నికల్లో ఆయన బిడ్డ, మాజీ కార్పొరేటర్ లాస్య నందితకు బీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చింది. బీజేపీ అభ్యర్థి శ్రీగణేష్‌పై 17,169 ఓట్ల తేడాతో లాస్య నందిత గెలుపొందారు.
ఇక కాంగ్రెస్‌లో గెలిచిన వారిలో కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై 57 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సత్తుపల్లి నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన సండ్ర వెంకట వీరయ్యను, తన తొలి ప్రయత్నంలో మట్టా రాగమయి చిత్తుగా ఓడించారు. డాక్టర్‌గా నియోజకవర్గంలో రాగమయి సుపరిచితురాలు కావడం ఆమెకు కలిసొచ్చింది. సండ్ర వెంటక వీరయ్యపై 19,440 ఓట్ల భారీ మెజార్టీతో రాగమయి గెలుపొందారు.
ఎలాంటి రాజకీయ అనుభవం లేని నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందారు. పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును 47,634 ఓట్ల భారీ మెజార్టీతో ఓడించి రికార్డు సృష్టించారు. రాజకీయ అనుభవం లేని యశస్విని, మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లిని చిత్తుగా ఓడించారు. నారాయణపేట నుంచి మాజీ ఎమ్మెల్యె చిట్టెం నర్సిరెడ్డి మనవరాలు, నారాయణపేట కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం శివకుమార్ కోడలు చిట్టెం పర్నికారెడ్డి నారాయణపేట నుంచి గెలుపొందారు. రాజకీయ అనుభవంలేని పర్నికా రెడ్డి.. బీఆర్‌ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డిని 7,951 ఓట్ల మెజార్టీతో ఓడించారు.