CHATGPT: కొంపముంచుతున్న AI టూల్స్.. నకిలీ పత్రాలు క్రియేట్ చేస్తున్న కేటుగాళ్లు!
CHATGPT: ఏఐ టూల్స్ వాడే ముందు.. దాని ఉపయోగాలపై కాకుండా దుష్పరిణామాలపైనా ఆలోచించే సమయం ఇది.

CHATGPT: కొంపముంచుతున్న AI టూల్స్.. నకిలీ పత్రాలు క్రియేట్ చేస్తున్న కేటుగాళ్లు!
CHATGPT: చాట్‌జీపీటీ గురించి వినే వారు ఎంతో ముచ్చటగా చెబుతారు. ఏదైనా అడిగితే పటాపటా సమాధానం.. క్షణాల్లో సమాచారం అందిస్తుందంటూ మెచ్చుకుంటారు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని విషయాలు చూస్తే మాత్రం ఇది అంత సురక్షితం కాదనిపిస్తోంది. ఆధార్, పాన్ కార్డుల వంటి కీలక ఐడీ ప్రూఫ్‌లను చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ ద్వారా డూప్లికేట్ చేసి తయారు చేస్తున్నారని బయటపడింది. కేవలం పేర్లు, పుట్టిన తేది, చిరునామా లాంటి డేటా ఇవ్వడం ద్వారా నకిలీ కార్డులు తయారవుతున్నాయంటే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఏప్రిల్ 4, 2025న యశ్వంత్ సాయి పాలఘాట్ అనే యువకుడు సోషల్ మీడియాలో షాకింగ్ సమాచారం షేర్ చేశాడు. చాట్‌జీపీటీ ఆధారంగా నకిలీ ఆధార్, పాన్ కార్డులు క్షణాల్లో తయారవుతున్నాయని తెలిపాడు. ఈ పోస్ట్ ప్రభుత్వ వర్గాలను సహా ఎంతో మందిని కలవరపరిచింది. ఎప్పటికప్పుడు మారుతున్న ఏఐ టెక్నాలజీ.. నేరస్థులకు కొత్త దారులు చూపిస్తున్నట్టుగా ఈ విషయం చెబుతోంది.
ఇది ఎలా జరుగుతోంది? GPT-4 ఇప్పుడు కేవలం ఒక చాట్‌బాట్ మాత్రమే కాదు.. ఫోటోరియలిస్టిక్ డిజైన్‌లను సృష్టించగలదు. పేర్లు, చిరునామా లాంటి వివరాలు ఇవ్వగానే ప్రభుత్వ డాక్యుమెంట్లను పోలిన డిజైన్‌లతో కార్డులను రూపొందించగలుగుతోంది. ఇవి అసలు ఆధార్ లేదా పాన్ డేటాబేస్ నుంచి నిజమైన సమాచారం కాకపోయినా.. ఫాంట్లు, లేఅవుట్లు, QR కోడ్‌లు బాగా పోలి ఉండడంతో నకిలీగా కనిపిస్తున్నాయి. ఈ డాక్యుమెంట్లను సాధారణ వ్యక్తులు చూసి నమ్మే అవకాశం ఉంది.
ఇది దేశ భద్రతకే కాదు.. సామాన్యుల భద్రతకూ ప్రమాదమే. ఎందుకంటే స్కామర్లు ఈ డూప్లికేట్ ఐడీలను ఉపయోగించి బ్యాంక్ ఖాతాలు తెరవడం, రుణాలు తీసుకోవడం లాంటి పనులు చేయొచ్చు. ఇది ఐడియా వినడమే భయానకంగా ఉంది కదా. అలాంటి ఫేక్ కార్డులతో మోసాలు జరిగితే బాధపడేది మానవత్వమే. నిజమైన ఆధార్, పాన్‌లలో ఉన్న హోలోగ్రామ్‌లు, సురక్షిత QR కోడ్‌లు వంటివి డూప్లికేట్ చేయడం సాధ్యం కాకపోయినా.. పైకి చూసే వారికి అర్థం కాదు కాబట్టి మోసానికి దారితీయొచ్చు.
ఇప్పుడు ఇదంతా చూస్తే మన ప్రభుత్వ ఆధారిత ఐడీ కార్డుల తయారీ విధానాన్ని మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఎంత ఉండో స్పష్టమవుతోంది. ఆధునిక టెక్నాలజీ ఒక్కొక్కసారి మన చేతిలో ఉన్న ఆయుధంలా మారుతుంది. అది మంచి చేతుల్లో ఉంటే సమాజానికి ఉపయోగపడుతుంది. కానీ అదే దురుద్దేశంతో వాడితే.. అనర్థాలే మిగులుతాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఏఐ టూల్స్ వాడే ముందు.. దాని ఉపయోగాలపై కాకుండా దుష్పరిణామాలపైనా ఆలోచించే సమయం ఇది.