India vs Pakistan Highlights: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ పై పాకిస్థాన్ విక్టరీ
India vs Pakistan Highlights: ప్రపంచకప్ ఆనవాయితీ తిరగరాసిన పాకిస్థాన్...
India vs Pakistan Highlights: హై ఓల్టేజ్ పోరు కాస్తా ఏకపక్షం అయింది. కీలక పోరులో దాయాదిదే పై చేయి. టీ-20 వరల్డ్ కప్ ల్లో తమకున్న చెత్త రికార్డును చెరిపేస్తూ చరిత్ర సృష్టించింది పాకిస్థాన్. 152 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్ ఓపెనర్లు వికెట్ కోల్పకుండా 18.5 ఓవర్లలో టార్గెట్ ఊదేశారు. ఇద్దరూ వికెట్ కోల్పోకుండా మరో 13 బంతులు మిగిలుండగానే నిర్దేశిత లక్ష్యాన్ని ఫినిష్ చేశారు. బాబర్ అజామ్ 52 బంతుల్లో 68 పరుగులు, మహ్మద్ రిజ్వాన్ 55 బంతుల్లో 79 పరుగులు చేశారు.
ఈ ఇద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీ బాదుతూ.. సింగిల్ తీస్తూ.. టీమిండియా బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ క్రమంలో పది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేశారు. ఆ తర్వాత కూడా బాబర్, రిజ్వాన్ ల వికెట్లు తీయలేక నానా తంటాలు పడ్డారు భారత బౌలర్లు. ఈ క్రమంలో మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ విజయంతో పాకిస్థాన్ 2 పాయింట్లతో టోర్నీలో బోణి చేసింది.
దుబాయ్ వేదికగా జరుగుతున్న హై ఓల్టేజ్ టెన్షన్ మ్యాచులో ఫస్ట్ లో తడబడ్డ భారత్ ఆఖరికి నిలబడింది. విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ కు తోడు.. పంత్ కీలక ఇన్నింగ్స్ టీమిండియాను రేస్ లో నిలబెట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 57 హాఫ్ సెంచరీతో ఆదుకోవడంతో దాయాదీ పాకిస్థాన్ ముందు భారత్ 152 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్‌కు.. రిషభ్ పంత్ 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 పరుగులు తోడవడంతో భారత్ పోరాడే స్కోర్ చేయగలిగింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది మూడు వికెట్లు తీయగా.. హసన్ అలీ, షాదాబ్ ఖాన్, హ్యారిస్ రౌఫ్ చెరొక వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్‌తో ప్రపంచ కప్ పోటీల్లో భారత్ పై గెలవలేదన్న అప్రదిష్ఠను పాకిస్థాన్ ఒక్క దెబ్బతో చెరిపివేసింది.