AUS vs IND: షెఫాలీ వర్మకు షాక్.. హర్లీన్‌కు అవకాశం! ఆస్ట్రేలియా సిరీస్‌కు భారత జట్టు ఇదే

Update: 2024-11-19 15:39 GMT

India Women Squad for Australia ODI Series: ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ భారత మహిళా జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా.. స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మకు షాక్ తగిలింది. శ్రేయాంక పాటిల్, సయాలీ సత్‌ఘరే, దయాళన్ హేమలత, ఉమ ఛెత్రి కూడా జట్టులో చోటు కోల్పోయారు. భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ 2025ను దృష్టిలో పెట్టుకుని మహిళల జట్టును బీసీసీఐ నిర్మిస్తోంది.

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దాంతో వన్డే ప్రపంచకప్ 2025 లక్ష్యంగా జట్టును సిద్ధం చేసే క్రమంలో బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే కొంతకాలంగా విఫలమవుతున్న షెఫాలీ వర్మపై వేటు వేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌లలో 33, 11, 12 రన్స్ చేసింది. గత 10 వన్డే ఇన్నింగ్స్‌లలో కేవలం 12.1 సగటుతో పరుగులు చేసింది. షెఫాలీ వన్డేల్లో చివరిగా 2022 జులైలో హాఫ్ సెంచరీ చేసింది. ఇప్పటివరకు మరలా ఆ మార్క్‌ను అందుకోలేకపోయింది.

గాయం కారణంగా న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన తర్వాత లెగ్ స్పిన్నర్ ఆశా శోభనా ఆస్ట్రేలియా సిరీస్‌కు సైతం దూరమైంది. ప్రియా పునియా, హర్లీన్ డియోల్ తిరిగి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. న్యూజిలాండ్‌పై అరంగేట్రం చేసిన సైమా ఠాకోర్, ప్రియా మిశ్రా, తేజల్ హసబ్నిస్‌లకు చోటు దక్కింది. మహిళల బిగ్ బాష్ లీగ్ ఆడుతున్న వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, యాస్తిక భాటియా, దీప్తి శర్మలు ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఉన్నారు. తొలి వన్డే డిసెంబర్ 5 (బ్రిస్బేన్), రెండో వన్డే డిసెంబర్ 8 (బ్రిస్బేన్), మూడో వన్డే డిసెంబర్ 11 (పెర్త్)న జరగనున్నాయి.

భారత మహిళల జట్టు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), జెమిమా రోడ్రిగ్స్, ప్రియా పునియా, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ (కీప‌ర్‌), యాస్తిక భాటియా (కీప‌ర్‌), దీప్తి శర్మ, తేజల్ హసబ్నిస్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, టిటాస్ సాధు , రేణుకా సింగ్, సైమా ఠాకూర్.

Tags:    

Similar News