KKR vs SRH match: హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందే కోల్‌కతా కేప్టేన్ అజింక్య రహానేను టెన్షన్ పెడుతున్న పిచ్

Update: 2025-04-03 11:54 GMT

KKR vs SRH match probability: హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందే కోల్‌కతా కేప్టేన్ అజింక్య రహానేను టెన్షన్ పెడుతున్న పిచ్

KKR vs SRH match winning probabilities: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళ రాత్రి 7:30 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అందులో కేవలం రాజస్థాన్ రాయల్స్‌పై ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల చేతిలో దారుణంగా ఓడిపోయింది. దీంతో కేవలం 2 పాయింట్స్‌తో ప్రస్తుతం ఐపిఎల్ 2025 పాయింట్స్ పట్టికలో కోల్‌కతా నైట్ రైడర్స్ అట్టడుగున 10వ స్థానంలో ఉంది.

ఇక సన్ రైజర్స్ హైదాబాద్ విషయానికొస్తే... హైదరాబాద్ జట్టు కూడా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం రాజస్థాన్ రాయల్స్‌పై మాత్రమే గెలిచి మరో రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. అయినప్పటికీ నెట్ రన్ రేట్ కొంత మెరుగ్గా ఉండటంతో ప్రస్తుతం ఐపిఎల్ 2025 పాయింట్స్ టేబుల్‌లో 8వ స్థానంలో కొనసాగుతోంది.

ఇప్పుడు తమ స్థానాన్ని మెరుగు పర్చుకోవడం కోసం ఇరు జట్లకు కూడా ఒక విజయం అత్యవసరం లాంటిదే. అందుకే ప్రత్యర్ధిపై విజయం కోసం ఇరు జట్లు కన్నేశాయి. అయితే, ఎలాగైనా ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై గెలవాలనే కసితో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ కేప్టెన్ అజింక్య రహానేను ఈడెన్ గార్డెన్స్ పిచ్ టెన్షన్ పెడుతోంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో అన్నిరకాల స్పిన్ బౌలర్స్ ఉన్నారు. కానీ ఈడెన్ గార్డెన్స్ పిచ్ మాత్రం స్పిన్ బౌలర్స్‌కు అనుకూలించడం లేదని రహానె టెన్షన్ పడుతున్నాడు. బెంగళూరుతో మ్యాచ్ కంటే ముందే పిచ్‌ను సెట్ చేయాల్సిందిగా రహానే పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీని కోరాడు. కానీ అది సాధ్యపడలేదు. ఓవర్ నైట్‌లో పిచ్ రకాన్ని మార్చలేమని ముఖర్జీ చెప్పినట్లు తెలుస్తోంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ చివరిగా ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైంది. హైదరాబాద్‌తో మ్యాచ్‌నైనా తమకు అనుకూలంగా ఉంటుందేమోనని కోల్‌కతా ఆశపడుతోంది. కానీ పిచ్ తీరును మార్చేంత సమయం క్యూరేటర్‌కు కూడా లేదు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ ఎలా ఉండనుందనే ఆసక్తి క్రికెట్ ప్రియుల్లో నెలకొని ఉంది.

ఐపిఎల్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంత దారుణంగా ఓడిపోయిందంటే...

2024 ఫైనల్‌లో తలపడిన ఈ రెండు జట్లు మరోసారి ఐపిఎల్ 2025 లో ఫేస్ టు ఫేస్ ఎదుర్కుంటున్నాయి. రెండు ఫైనలిస్టు జట్లు ఆడుతున్న మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌పై క్రికెట్ ప్రియుల్లో ఇంకాస్త ఎక్కువ ఉత్కంఠే కనిపిస్తోంది. గతేడాది మే 26న జరిగిన ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగుల స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ అయింది.

ఆ స్వల్ప స్కోర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మరో 57 బాల్స్ మిగిలి ఉండగానే 8 వికెట్స్ తేడాతో ఛేదించి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విన్నింగ్ ప్రాబబిలిటీ విషయానికొస్తే... కోల్‌కతాకు 45 % గెలిచే అవకాశాలు ఉంటే సన్ రైజర్స్‌కు 55% అవకాశాలు ఉన్నాయి. మరి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌తో ఆనాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అనేది వేచిచూడాల్సిందే. 

Tags:    

Similar News