IPL 2025 : అన్న దెబ్బకు చెదిరిన తమ్ముడి కల.. హార్దిక్ వీరోచిత పోరాటం వృథా!

Update: 2025-04-08 03:00 GMT
IPL 2025 : అన్న దెబ్బకు చెదిరిన తమ్ముడి కల.. హార్దిక్ వీరోచిత పోరాటం వృథా!
  • whatsapp icon

IPL 2025 : వాంఖడే స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. పదేళ్ల తర్వాత ముంబై సొంతగడ్డపై ఆర్‌సీబీ విజయం సాధించింది. అయితే, హార్దిక్ పాండ్యా కేవలం 15 బంతుల్లో 280 స్ట్రైక్ రేట్‌తో 42 పరుగులు చేసి ముంబై విజయం దిశగా తీసుకెళ్తున్న సమయంలో అతని అన్నయ్య కృనాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్‌తో ముంబై విజయాన్ని లాగేసుకున్నాడు. గెలిచే స్థితిలో ఉన్న మ్యాచ్ ఓడిపోవడంతో హార్దిక్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. వరుసగా రెండోసారి ఇలాంటి ఓటమి ఎదురుకావడంతో కన్నీళ్లు పెట్టుకునేంత బాధలో కనిపించాడు.

హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్

222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై తొలి 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కు వచ్చాడు. 14వ ఓవర్‌లో స్ట్రైక్ అందుకున్న అతను హేజిల్‌వుడ్‌పై 5 బంతుల్లో 20 పరుగులు పిండేశాడు. తర్వాతి ఓవర్‌లో మరో రెండు సిక్సర్లు బాదాడు. ఇలా కేవలం 7 బంతుల్లో 32 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. తన సొంత అన్నయ్య వేసిన ఓవర్‌లో ఏకంగా 19 పరుగులు రాబట్టి ముంబైని గెలుపు దిశగా నడిపించాడు.

అతను కేవలం 34 బంతుల్లో తిలక్ వర్మతో కలిసి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అతని విధ్వంసక ఇన్నింగ్స్ మ్యాచ్ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. హార్దిక్ 15 బంతుల్లో 42 పరుగులు చేసి 19వ ఓవర్ తొలి బంతికి హేజిల్‌వుడ్ చేతికి చిక్కాడు. అతను అవుటయ్యే సమయానికి ముంబై విజయానికి 11 బంతుల్లో 28 పరుగులు అవసరం కాగా, క్రీజులో నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్ వంటి బ్యాటర్లు ఉన్నారు. తన పోరాటం ఫలిస్తుందని హార్దిక్ గట్టిగా నమ్మాడు. కానీ చివరి ఓవర్‌లో అతని అన్నయ్య అతడి ఆశలన్నింటినీ తలకిందులు చేశాడు.

చివరి ఓవర్‌లో కృనాల్ మాయాజాలం

హార్దిక్ అవుటైన తర్వాత హేజిల్‌వుడ్ చివరి 5 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్‌లో ముంబై విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ బంతిని కృనాల్ పాండ్యాకు అందించాడు. తొలి బంతికే మిచెల్ సాంట్నర్‌ను, రెండో బంతికి దీపక్ చాహర్‌ను అవుట్ చేసి కృనాల్ ముంబై విజయాన్ని కష్టతరం చేశాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో 6 పరుగులు రావడంతో ముంబై విజయానికి 2 బంతుల్లో 13 పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతికి నమన్ ధీర్‌ను పెవిలియన్ చేర్చి మ్యాచ్ టై అయ్యే అవకాశాన్ని కూడా లేకుండా చేశాడు. ఇలా చివరి ఓవర్‌లో కేవలం 6 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన కృనాల్ తన తమ్ముడి జట్టు నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు.

Tags:    

Similar News