Gautam Gambhir :గంభీర్‌ను చంపేస్తానంటూ ఈమెయిల్స్.. గుజరాత్‌లో ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్!

Update: 2025-04-27 03:30 GMT
Gautam Gambhir :గంభీర్‌ను చంపేస్తానంటూ ఈమెయిల్స్.. గుజరాత్‌లో ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్!
  • whatsapp icon

Gautam Gambhir : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ప్రాణహాని బెదిరింపుల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత జట్టు మాజీ దిగ్గజ బ్యాటర్, ప్రస్తుత కోచ్ అయిన గంభీర్‌కు ఇటీవల బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను దారుణంగా హతమార్చిన రోజునే గంభీర్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి.

పహల్గాం దాడి రోజే బెదిరింపులు:

ఐపీఎల్ 2025 కారణంగా ప్రస్తుతం విరామంలో ఉన్న గౌతమ్ గంభీర్ ఏప్రిల్ 24న ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని బెదిరింపులతో రెండు ఈమెయిల్స్ వచ్చాయని తెలిపారు. సెంట్రల్ ఢిల్లీలోని రాజేందర్ నగర్‌లో నివసించే గంభీర్ అక్కడి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఏప్రిల్ 22న మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో తనకు రెండు ఈమెయిల్స్ వచ్చాయని చెప్పారు. ఆ రెండు ఈమెయిల్స్‌లోనూ ‘IKillU’ (నేను నిన్ను చంపేస్తాను) అని రాసి ఉంది. ఈమెయిల్స్ పంపిన వ్యక్తి తనను తాను ISIS కాశ్మీర్ సభ్యుడిగా చెప్పుకున్నాడు.

గుజరాత్ ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్

జమ్మూ కాశ్మీర్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను చంపిన రోజే గంభీర్‌కు ఈ బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. టీమిండియా హెడ్ కోచ్, భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ అయిన గంభీర్‌కు వచ్చిన ఈ భయంకరమైన బెదిరింపులపై ఢిల్లీ పోలీసులు వేగంగా స్పందించారు. ఏప్రిల్ 26న సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీసులు గుజరాత్‌లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. గంభీర్‌కు బెదిరింపు ఈమెయిల్స్ పంపిన వ్యక్తిని జిగ్నేష్ సింగ్ పర్మార్ గా గుర్తించినట్లు వార్తా సంస్థ ANI ఢిల్లీ పోలీసుల సమాచారాన్ని ఉటంకిస్తూ తెలిపింది.  

కుటుంబ సభ్యుల వాదన

21 ఏళ్ల జిగ్నేష్ సింగ్ గుజరాత్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి అని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు విచారించారు. అయితే, జిగ్నేష్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని అతని కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

Tags:    

Similar News