IPL 2025 : ఈడెన్ గార్డెన్స్‌లో వర్ష బీభత్సం.. KKR vs PBKS మ్యాచ్ రద్దు.. చెరోపాయింట్!

IPL 2025 : ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం జరిగిన ఈ పోరులో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఆతిథ్య జట్టు KKR ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. అయితే, కోల్‌కతా ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే వర్షం రావడంతో అంతా తారుమారైంది. దాదాపు గంటన్నర పాటు వేచి చూసినా వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సీజన్‌లో మ్యాచ్ రద్దు కావడం ఇదే తొలిసారి. ఈ ఫలితం డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా చేసింది.
ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మరోసారి అభిమానుల కొరత కనిపించింది. స్టేడియం పూర్తిగా నిండకపోవడం నిరాశ కలిగించింది. ఈ సీజన్‌లో ఇదివరకే ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. దీంతో సొంతగడ్డపై KKRకు ఆశించినంత మద్దతు లభించలేదు. ఇక మైదానంలో ఉన్న కొద్దిమంది ప్రేక్షకులు కూడా పంజాబ్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. ఈ సీజన్‌లో ఈ యువ ఓపెనర్లు పంజాబ్‌కు మెరుపు ఆరంభాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనూ అదే పునరావృతమైంది.
తొలి సీజన్ ఆడుతున్న ప్రియాన్ష్ ఆర్య (69 పరుగులు) మరోసారి తన మెరుపు బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రభ్‌సిమ్రాన్‌తో కలిసి పవర్‌ప్లేలో జట్టుకు అర్థ శతక భాగస్వామ్యాన్ని అందించాడు. ఆ తర్వాత కాస్త నెమ్మదించినా, పదో ఓవర్ నుంచి వీరిద్దరూ మళ్లీ విజృంభించారు. ప్రియాన్ష్ కేవలం 27 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇది అతడి రెండో అర్ధ శతకం. మరోవైపు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా అద్భుతమైన అర్ధ శతకం సాధించాడు. వీరిద్దరూ కలిసి 11.5 ఓవర్లలో 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రియాన్ష్ ఔటైన తర్వాత ప్రభ్‌సిమ్రాన్ మరింత దూకుడుగా ఆడి 83 పరుగులతో చెలరేగాడు. వీరిద్దరి ధాటికి పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది.
ప్లేఆఫ్ రేసులో KKRకు కష్టాలు
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ముగిసే సమయానికి ఒక్కసారిగా వర్షం మొదలైంది. ఆ తర్వాత ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితం పంజాబ్ కింగ్స్‌కు లాభించింది. 11 పాయింట్లతో ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. కానీ కోల్‌కతా మాత్రం 7 పాయింట్లతో ఏడో స్థానంలోనే కొనసాగుతోంది. ఇప్పటికే ప్లేఆఫ్ రేసులో వెనుకబడిన డిఫెండింగ్ ఛాంపియన్ KKR ఇప్పుడు మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే వారు ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది.