Sheik Rasheed: బరిలోకి గుంటూరు మిర్చి.. ధోనీ టీమ్ తరుఫున రంగంలోకి షేక్ రషీద్.. ఎవరితను?
Sheik Rasheed: చెన్నైలో డెబ్యూ చేసేందుకు షేక్ రషీద్ సిద్ధమవుతున్న ఈ సందర్భంలో అతడి ప్రతిభను ప్రేక్షకులంతా ఆస్వాదించేందుకు వేచి చూస్తున్నారు. టీమిండియా ప్రయాణం చేయాలన్న కలను ముందుకు తీసుకెళ్లే వేదికగా ఐపీఎల్ మారుతుందేమో చూడాలి.

Sheik Rasheed: బరిలోకి గుంటూరు మిర్చి.. ధోనీ టీమ్ తరుఫున రంగంలోకి షేక్ రషీద్.. ఎవరితను?
Sheik Rasheed: షేక్ రషీద్… మరో తెలుగు యువ క్రికెటర్ ఐపీఎల్ వేదికపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున పంజాబ్ కింగ్స్‌తో ముల్లాన్‌పూర్ వేదికగా జరగబోయే కీలక మ్యాచ్‌లో రషీద్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వరుసగా మూడు పరాజయాల తర్వాత దెబ్బతిన్న సీఎస్‌కే జట్టులో చోటు దక్కించుకున్న తొలి తెలుగు ప్లేయర్‌గా రషీద్ చరిత్ర సృష్టించబోతున్నాడన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఈ ఐపీఎల్ సీజన్‌ను ముంబైపై విజయంతో ఆరంభించిన సీఎస్‌కే… ఆ తర్వాత ఆర్‌సీబీ, రాజస్థాన్, ఢిల్లీ చేతిలో ఓటములు చవిచూసింది. బ్యాటింగ్ విఫలమవడం జట్టు విజయం దూరం కావడానికి ప్రధాన కారణంగా మారింది. ఇప్పటికే కొన్ని మార్పులతో తుది జట్టు బరిలోకి దిగినప్పటికీ ఫలితం లభించకపోవడంతో… కీలక ఆటగాళ్లను పక్కకు నెట్టి యువతను వేదికపైకి తీసుకురావాలన్న ఆలోచనతోనే రషీద్‌కు అవకాశం ఇస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే, పంజాబ్ మాత్రం మంచి జోరుమీదుంది. మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో మూడో స్థానంలో నిలిచిన పంజాబ్… సొంతగడ్డపై చెన్నైపై విజయం సాధించి పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకు ఇరుజట్లు తలపడిన 30 మ్యాచ్‌ల్లో చెన్నై 16, పంజాబ్ 14 విజయాలు సాధించాయి. ఈ గణాంకాలు చూస్తే గట్టి పోటీగా మ్యాచ్ జరుగనుంది. రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు నిరాశపరిచిన నేపథ్యంలో టాప్ ఆర్డర్ బలహీనంగా మారింది. అలాగే మధ్యలో శివమ్ దూబే బ్యాట్ మౌనంగా మారింది. విజయ్ శంకర్ గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించినా అతని నెమ్మదిగా ఆడిన ఇన్నింగ్స్ విమర్శలకు దారి తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో అతని స్థానంలో షేక్ రషీద్‌ను తీసుకురావాలన్న యోచన బలపడుతోంది.
రషీద్ కుడిచేతి బ్యాటర్. క్లాసిక్ షాట్లతో ఆకట్టుకునే టాలెంట్ అతనికి ఉంది. ప్రతి ఇన్నింగ్స్‌ను విశ్లేషించుకుని, అందులోని తప్పులను అభ్యాసంతో సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు. సహచరుల అభిప్రాయం ప్రకారం నెట్ సెషన్లలో బౌలర్లకు అతడు పెద్ద సవాలుగా మారతాడని అంటున్నారు. అతనికి విరాట్ కోహ్లీనే మార్గదర్శి. కోహ్లీ ఆటతీరు, ఆత్మవిశ్వాసం, ఫిట్‌నెస్‌పై తీసుకునే శ్రద్ధను ఆదర్శంగా తీసుకుంటూ, తన ఆటను మెరుగుపర్చేందుకు నిరంతరం శ్రమిస్తుంటాడు.