IPL 2025 : కోహ్లీ, హేజిల్‌వుడ్ అదరగొట్టినా..రాజస్థాన్‌కు షాకిచ్చింది మాత్రం ఆ ప్లేయరే

IPL 2025 : ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఏం చేయాలో అది చేసి చూపించింది. ఈ సీజన్‌లో బయటి మ్యాచ్‌లన్నింటినీ గెలుచుకున్న బెంగళూరు, నాలుగో ప్రయత్నంలో తన హోమ్ గ్రౌండ్ ఎం చిన్నస్వామి స్టేడియంలో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌పై బెంగళూరు ఈ విజయాన్ని అందుకుంది. ఇందులో జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేయగా, జోష్ హేజిల్‌వుడ్ 19వ ఓవర్‌లో జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. అయితే నిజానికి మ్యాచ్‌ను తిప్పింది మాత్రం జితేష్ శర్మ. అతని ఒక్క నిర్ణయం బెంగళూరుకు విజయాన్ని అందించింది.
గురువారం ఏప్రిల్ 24న ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు తరఫున విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీలు సాధించగా, జితేష్ శర్మ చివర్లో కేవలం 10 బంతుల్లో 20 పరుగులు చేసి జట్టును 205 పరుగుల వరకు చేర్చాడు. రాజస్థాన్ రాయల్స్ విజయం కోసం 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా, ఒకానొక సమయంలో జట్టు అద్భుతమైన స్థితిలో కనిపించింది. గత 2 మ్యాచ్‌లలో ఓటమికి కారణమైన ధ్రువ్ జురెల్ జట్టును గెలిపించేలా కనిపించాడు.
అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో మ్యాచ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ మొదట జురెల్‌ను, ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్‌ను అవుట్ చేసి కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. దీంతో హేజిల్‌వుడ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కానీ ఇందులో జితేష్ కీలక పాత్ర పోషించాడు. నిజానికి ఈ ఓవర్‌లోని మూడో బంతి వైడ్-యార్కర్. జురెల్ దానిని ఆడలేకపోయాడు. బంతి వికెట్ కీపర్ జితేష్ గ్లవ్స్‌లోకి వెళ్లింది.
అందరూ తర్వాతి బంతి కోసం సిద్ధమవుతుండగా, జితేష్ క్యాచ్ కోసం అప్పీల్ చేయడం ప్రారంభించాడు. అతను ఎందుకు అప్పీల్ చేస్తున్నాడని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అతను తన కెప్టెన్ రజత్ పాటిదార్‌ను ఒప్పించి, బంతి బ్యాట్ వెనుక భాగానికి తగిలిందని వివరించాడు. జితేష్ మాట విని పాటిదార్ రివ్యూ కోరాడు. రీప్లేతో పాటు స్నికోమీటర్ చిత్రం కనిపించినప్పుడు, బంతి బ్యాట్ వెనుక భాగాన్ని తాకినట్లు కనిపించింది. జితేష్ చెప్పింది నిజమైంది. జురెల్ 34 బంతుల్లో 47 పరుగులు చేసి అవుటయ్యాడు.
ఈ వికెట్ చాలా కీలకం ఎందుకంటే జితేష్ గత ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ బౌలింగులో చితక్కొడుతూ 22 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఆ సమయంలో అతని జట్టుకు 10 బంతుల్లో కేవలం 17 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. కానీ అతను అవుట్ అవ్వడంతో బెంగళూరు పుంజుకుంది. హేజిల్‌వుడ్ తర్వాతి బంతికి మరో వికెట్ తీశాడు. చివరి ఓవర్‌లో కూడా 17 పరుగులు అవసరం కాగా, యష్ దయాల్ దానిని పూర్తి కానివ్వలేదు. ఈ సీజన్‌లో జితేష్ తెలివి తేటలతో బెంగళూరుకు వికెట్ లభించడం ఇది రెండోసారి. అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అతని పట్టుదల వల్లే RCB రివ్యూకు వెళ్లి రాయన్ రికల్టన్ వికెట్‌ను దక్కించుకుంది.