IPL 2025 : డబ్బులు కాదు.. బుర్ర ముఖ్యం! అయ్యర్ తెలివితో పంజాబ్‌కు విజయం!

Iyer's Tactical Masterclass Leads Punjab to Victory
IPL 2025 : పంజాబ్ కింగ్స్ తమ కొత్త హోమ్ గ్రౌండ్‌లో ఏప్రిల్ 8న సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో గెలిచింది. కానీ ఈ గెలుపు తర్వాత అందరి మదిలో మెదిలిన ప్రశ్న ఒకటే.. చాహల్ మ్యాచ్‌లో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే ఎందుకు వేశాడు? పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ చాహల్‌తో పూర్తి ఓవర్లు ఎందుకు వేయించలేదు? ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం ఇప్పుడు శ్రేయాస్ అయ్యరే స్వయంగా చెప్పాడు. మ్యాచ్ తర్వాత చాహల్‌ను బౌలింగ్ చేయకుండా ఆపడానికి గల కారణం అడిగితే.. అది ఒక ఆలోచించి చేసిన వ్యూహమని చెప్పాడు. ఏదేమైనా.. చాహల్‌తో పూర్తి ఓవర్లు వేయించని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నిర్ణయాన్ని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు.
ముందుగా చాహల్‌ను ఎందుకు బౌలింగ్‌కు పిలవలేదో తెలుసుకుందాం. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రకారం అది అతని వ్యూహాత్మక నిర్ణయం. ఎందుకంటే క్రీజ్‌లో దూబే, కాన్వే ఉన్నారు. మిడిల్ ఓవర్లలో వాళ్లిద్దరూ కొన్ని బంతులు కూడా ఆడేసారు. అలాంటి సమయంలో చాహల్‌ను బౌలింగ్‌కు దింపితే దూబే, కాన్వే అతనిపై ఎదురుదాడి చేసే అవకాశం ఉందని అయ్యర్ భావించాడు. చాహల్ స్మార్ట్ బౌలరే అనడంలో ఎలాంటి సందేహం లేదని అయ్యర్ చెప్పాడు. కానీ ఆ సమయంలో పేసర్‌లతోనే కొనసాగాలని తన మనసు చెప్పిందన్నాడు. అందుకే తాను అదే పని చేశానని.. పేసర్లను అటాక్‌కు దించానని.. వాళ్ల స్లో బంతులు తమ జట్టుకు బాగా పనిచేశాయని అయ్యర్ తెలిపాడు.
చాహల్ వేసింది ఒక్క ఓవరే.. ఇచ్చిన పరుగులు ఎన్నో తెలుసా?
చాహల్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్. పంజాబ్ కింగ్స్ అతన్ని కొనడానికి ఏకంగా 18 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయినప్పటికీ అతను వేసింది మాత్రం ఒక్క ఓవరే. 17వ ఓవర్ వేసిన అతను కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
చాహల్‌ను దూరం పెట్టినందుకు అయ్యర్‌కు ప్రశంసలు:
భారత సీనియర్ క్రికెటర్ హనుమ విహారి.. చాహల్‌ను బౌలింగ్ చేయకుండా ఆపిన శ్రేయాస్ అయ్యర్ నిర్ణయాన్ని ఒక మాస్టర్ స్ట్రోక్‌గా అభివర్ణించాడు. అతని కెప్టెన్సీని ఆకాశానికెత్తాడు. మీ వద్ద ఎన్ని బాణాలు ఉన్నాయి.. ఎలాంటి బాణాలు ఉన్నాయి అనేది ముఖ్యం కాదని.. వాటిని మీరు ఎలా ఉపయోగిస్తారు అనేదే ముఖ్యమని హనుమ విహారి అన్నాడు. 18 కోట్ల లాంటి భారీ మొత్తం, అత్యంత విజయవంతమైన బౌలర్ అనే ట్యాగ్‌ను పట్టించుకోకుండా చాహల్‌ను బౌలింగ్‌కు దూరంగా ఉంచిన శ్రేయాస్ అయ్యర్ అలానే చేశాడని కొనియాడాడు. ఇది అద్భుతమైన కెప్టెన్సీ ప్రదర్శన అని చెప్పాడు. పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడిస్తూ ఐపీఎల్ 2025లో తమ మూడో విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు వాళ్లు ఆడింది మొత్తం 4 మ్యాచ్‌లు.