Sashtanga Namaskaram: "సాష్టాంగ నమస్కారం" అంటే ఏంటి..? అది ఎలా చేయాలి..?
Sashtanga Namaskaram: నమస్తే,నమస్కారం లేదా నమస్కార్.. ఈ పదము సంస్కృతంలోని "నమస్సు" నుండి ఉద్భవించింది. నమస్సు లేదా "నమః" అనగా "మనిషిలో గల ఆత్మ"ను గౌరవించుట. ఈ సంప్రదాయము భారతదేశంలో ఎక్కువగా వాడుకలో ఉంది. ప్రత్యేకంగా హిందూ, జైన, బౌద్ధ మతాలలో మనం ఎక్కువగా చూస్తాము. గురువులు, పెద్దవారు ఎవరైనా ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ గౌరవాన్ని చూపడం.
నమస్కారం చేయడాన్ని మన శాస్త్రాల్లో నాలుగు విధాలు అవి
1. సాష్టాంగ నమస్కారం
2. దండ ప్రణామం
3. పంచాంగ నమస్కారం
4. అంజలి నమస్కారం.
సాష్టాంగ నమస్కారము లేదా అష్టాంగ నమస్కారం అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారం చేయడం అని అర్ధము. అవి ఏవి..? ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం
1. "ఉరసా" అంటే తొడలు అని అర్థం.
2. "శిరసా" అంటే తల అని అర్థం.
3. "దృష్ట్యా" అనగా కళ్ళు అని అర్థం.
4. "మనసా" అనగా హృదయం అని అర్థం.
5. "వచసా" అనగా నోరు అని అర్థం.
6. "పద్భ్యాం" అనగా పాదములు అని అర్థం.
7. "కరాభ్యాం" అనగా చేతులు అని అర్థం.
8. "కర్ణాభ్యాం" అంటే చెవులు అని అర్థం.
మనం చేసే నమస్కారం ఇలా 8 అంగములతో కూడినదై ఉంటుంది కాబట్టి దీనిని అష్టాంగ నమస్కారం అంటారు.
మానవుడు సహజంగా ఈ 8 అంగాలతోనే తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకునిపై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలేలా నమస్కరించాలి. ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి.
ముఖ్యంగా స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు కేవలం పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని మన శాస్త్రం చెబుతుంది.