Karthika Masam 2024: రేపటి నుంచే కార్తీక మాసం.. కార్తీక స్నానాలు ఎప్పుడు చేయాలో తెలుసా?

Karthika Masam 2024: ఈ ఏడాది నవంబర్ 2 నుంచి కార్తీకమాసం (Karthika Masam) ప్రారంభం అవుతుంది. హిందూ సంప్రదాయాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

Update: 2024-11-01 11:32 GMT

Karthika Masam 2024

Karthika Masam 2024: ఈ ఏడాది నవంబర్ 2 నుంచి కార్తీకమాసం (Karthika Masam) ప్రారంభం అవుతుంది. హిందూ సంప్రదాయాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్ని మాసాల్లో కెల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కావడంతో హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నెల రోజులు శివారాధన చేస్తూ కార్తీక సోమవారాలు ఉపవాసాలు ఆచరిస్తూ ఆ శివుడిని అనుగ్రహం పొందటం కోసం ప్రయత్నిస్తారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో ఈ మాసం మొత్తం భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. బ్రహ్మముహూర్తంలో కార్తీక స్నానం, కార్తీక దీపం వెలిగిస్తారు.

అయితే ఈ ఏడాది నవంబర్ 2న కార్తీక మాసం (Karthika Masam) ప్రారంభమవుతుంది. నవంబర్ 1న పాడ్యమి ఘడియలు వచ్చినప్పటికీ సూర్యోదయ సమయంలో అమావాస్య ఘడియలు ఉన్నందున నవంబర్ 2 నుంచి కార్తీక స్నానాలు ప్రారంభించాలని పండితులు చెబుతున్నారు. ఈ మాసంలో ఏ శివాలయంలో చూసినా భక్తులతో కిటకిటలాడిపోతాయి. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తూ భక్తులు శివుని అనుగ్రహం కోసం పరితపిస్తారు. శివాలయంలో భక్తులు అభిషేకాలు నిర్వహిస్తూ తమ దోషాలు, బాధలు తొలగిపోవాలని శివుడిని కోరుకుంటారు. అయ్యప్ప దీక్షలు ప్రారంభమయ్యేది ఈ నెలలోనే.

ఈ మాసంలో శివలింగానికి బిల్వదళాలతో అర్చన చేయడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ రోజు పవిత్ర నదీ స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగిస్తారు. వాటిని పారే నీటిలో లేదా చెరువులో వదిలేస్తారు. కార్తీక మాసంలో చేసే దీపారాధన చాలా మహిమ కలిగినదని చెబుతుంటారు. సాయంత్రం వేళ భక్తులు గుడిలో దీపారాధన చేస్తారు. ఇలా చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. కొంతమంది కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపం వెలిగించి శివుడిని దర్శించుకుంటారు.

కార్తీక మాసంలో భక్తులు మాంసాహారానికి, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉంటారు. ఈ నెల రోజులు కేవలం పూజలు, వ్రతాలు, నోములు జరుపుకుంటారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజ చేస్తారు. ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నివాసంగా చెబుతుంటారు. అందుకే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తారు. ఎంతో విశిష్టమైన కార్తీక పౌర్ణమి సహా కార్తీక మాసంలోని ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకుందాం.

* కార్తీక మాసం నవంబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది.

* నవంబర్ 3న ఆదివారం, యమవిదియ - భగినీహస్త భోజనం

* నవంబర్ 4న- మొదటి కార్తీక సోమవారం

* నవంబర్ 5న మంగళవారం - నాగుల చవితి

* నవంబర్ 6న బుధవారం - నాగపంచమి

* నవంబర్ 11న రెండవ కార్తీక సోమవారం

* నవంబర్ 12న మంగళవారం- ఏకాదశి- దీన్నే మాతత్రయ ఏకాదశి అంటారు.

* నవంబర్ 13న బుధవారం - క్లీరాబ్ది ద్వాదశి దీపం

* నవంబర్ 15న శుక్రవారం - కార్తీక పూర్ణిమ, జ్వాలాతోరణం (365 వత్తులతో దీపాలు వెలిగిస్తారు)

* నవంబర్ 18న కార్తీకమాసం మూడో సోమవారం

* నవంబర్ 19న మంగళవారం - సంకటహర చతుర్థి (గణేశుడికి గరిక సమర్పిస్తారు)

* నవంబర్ 25న కార్తీక మాసం నాలుగో సోమవారం

* నవంబర్ 26న మంగళవారం - కార్తీక బహుళ ఏకాదశి

* నవంబర్ 29న శుక్రవారం - కార్తీక మాసంలో శివరాత్రి

* డిసెంబర్ 1న ఆదివారం - కార్తీక అమావాస్య

Tags:    

Similar News