Ugadi 2024: ఉగాది రోజు పంచాంగ శ్రవణం కచ్చితంగా చేయాలి.. ఎందుకో తెలుసా..?
Ugadi 2024: ఉగాది తెలుగువారి పండుగ. ఈ రోజు నుంచి తెలుగు క్యాలెండర్ మొదలవుతుంది.
Ugadi 2024: ఉగాది తెలుగువారి పండుగ. ఈ రోజు నుంచి తెలుగు క్యాలెండర్ మొదలవుతుంది. అలాగే ఏడాదిలో వచ్చే మొదటి పండుగ ఉగాది. ఈ రోజున ఉదయమే నిద్రలేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజ చేయాలి. అనంతరం ఉగాది పచ్చడి తయారుచేసి తాగి రోజును ప్రారంభించాలి. చైత్ర మాస శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకుంటాం. ఈ రోజే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. అలాగే అన్ని రుతువుల్లో ఎంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు మొదలయ్యే రోజు కూడా ఈ రోజే. అందుకే కొత్త జీవితం నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. అంతే కాకుండా ఈరోజు అందరూ ఒకే చోట కూర్చొని పంచాంగ శ్రవణం వింటుంటారు. ఈ ఏడాది ఎలా ఉండబోతుంది. ఏ రాశికి ఈ ఏడాది అనుకూలంగా ఉందో తెలుసుకుంటారు. అయితే ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.
పంచాంగం అనేది ఐదు అంగాల కలియక. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ అని పిలుస్తారు. వీటిద్వారా భవిష్యత్‌లో మనకు వచ్చే విశేషాలు, పండుగలు, గ్రహణాలు, వర్ష వివరాలు, కాల నిర్ణయాలు, వర్షపాతములు మొదలైనవి తెలుసుకోవచ్చు. ఈ రోజు పంచాగ శ్రవణం వినడం చాలా మంచిదని పండితుల అభిప్రాయం. భవిష్యత్‌ను మనకు తెలియజేయడమే కాకుండా దీని వెనుక ఆధ్యాత్మిక అర్థం కూడా దాగి ఉంది. శ్రీ మహావిష్ణువు అయిన కాల పురుషుడిని గౌరవించేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు. భగవంతుని కాలాన్ని లేదా కాలపురుషుడి ని ఆరాధించడం అంటే ఆయనకు నివాళులు అర్పించినట్లే. అంతే కాకుండా మనం రాబోయే సంవత్సరంలో వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే విషయాలు తెలుస్తాయి.
ఉగాదిని మనం మాత్రమే కాదు దాదాపు దేశంలోని ప్రజలు అందరూ చేసుకుంటారు. కాకుంటే వాళ్లు పెట్టుకున్న పేర్లు వేరే ఉన్నాయి. మరాఠీలు ఉగాదిని గుడి పడ్వా అని, తమిళులు పుత్తాండు, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖీ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ అనే వివిధ పేర్లతో ఉగాదిని జరుపుకుంటారు. ఇందులో తమిళనాడులో మాత్రమే ఈ పండుగని ఆర్య సంస్కృతికి చిహ్నంగా భావించి కొత్త సంవత్సరాన్ని జనవరిలో వచ్చే సంక్రాంతి సమయంలోనే జరుపుకోవాలి అని చట్టం తెచ్చింది. కానీ తెలుగువారికి మాత్రం ఈ రోజు నుంచే ఏడాది ప్రారంభమవుతుంది.