బండికి చలాన్.. బయటపడ్డ భర్త బాగోతం.. చుక్కలు చూపించిన భార్య..

* ఈ స్టోరీ చదివితే పురుషపుంగవులు ఇకపై హెల్మెట్ లేకుండా టూ వీలర్ ను డ్రైవ్ చేయరు.

Update: 2023-05-11 09:30 GMT

 బండికి చలాన్.. బయటపడ్డ భర్త బాగోతం.. చుక్కలు చూపించిన భార్య

Traffic Challan: ఈ స్టోరీ చదివితే పురుషపుంగవులు ఇకపై హెల్మెట్ లేకుండా టూ వీలర్ ను డ్రైవ్ చేయరు. నిఘా నేత్రం ఎఫెక్ట్ అలా ఉంది మరి.. ట్రిపుల్ రైడింగ్, హెల్మెంట్ లేకుండా బండి నడిపితే..పోలీసులు ఫోటోలు తీసి చలాన్లు విధిస్తున్న సంగతి మనకు తెలిసిందే కదా...మన రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాల్లో ఇలాంటి నియమాలే ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో అయితే సేఫ్ కేరళ నినాదంతో రోడ్లపై కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించేవారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఇలా వేసిన ఓ ఫైన్..పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది. భర్తను జైలు గోడల వెనక్కి పంపింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం ఇడుక్కి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న వస్త్ర దుకాణంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తున్నాడు. ఇతడు గత నెల25న హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపాడు. అతడు ప్రయాణించిన దారిలో ఏర్పాటు చేసిన కెమెరా సదరు వ్యక్తి హెల్మెట్ ధరించలేదని గుర్తించి ఫోటోను క్లిక్కుమనిపించింది. అనంతరం చలాన్ ను పోలీసులు బైక్ నంబర్ ఆధారంగా ఫోన్ కు పంపించారు. ఇదే మనోడి కొంపు ముంచింది. కాపురంలో చిచ్చుపెట్టింది.

సదరు వ్యక్తి డ్రైవ్ చేస్తుండగా వెనుక సీటులో ఓ మహిళ కూర్చొని ఉంది. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, చలాన్, చలాన్ తో పాటు ఫోటో ఆ వ్యక్తి భార్య ఫోన్ కు వచ్చింది. ఇలా ఎందుకంటే ఆ బైక్.. ఆ వ్యక్తి భార్య పేరుపై రిజిస్టర్ అయింది. దీంతో ఫోటోను చూసిన భార్య.. భర్తను నిలదీసింది. వెనక కూర్చున్న మహిళ ఎవరు అంటూ గొడవకు దిగింది. ఎవరో తనకు తెలియదు అని దారిలో లిఫ్ట్ అడిగితే ఇచ్చానంటూ భర్త సర్దిచెప్పినా.. భార్య సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య తరచుగా గొడవలు జరగడం మొదలైంది. కట్ చేస్తే ఇటీవలే సదరు మహిళ తన భర్త శారీరకంగా వేధిస్తున్నాడంటూ, మూడేళ్ల కూతురును కూడా హింసిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సదరు వ్యక్తిపై గృహ హింస సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే... ఆ రోజు అతనితో పాటు బైక్ ఎక్కిన ఆ మహిళ ఎవరు అనేది ఇంత వరకు తెలియలేదు. మరి, భార్య అనుమానిస్తున్నట్లు ఆ మహిళ తన భర్త ప్రియురాలా... లేక భర్త చెబుతున్నట్టే ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడా.. అనేది ఇప్పటికీ తేలలేదు.. మరి, పోలీసులు దర్యాప్తు చేసి కాపురం నిలబెడతారో లేదో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఇక, ఈ విషయం తెలుసుకున్న కొంటె భర్తలు మాత్రం.. ఇకపై హెల్మెట్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేసేది లేదంటున్నారు.

Tags:    

Similar News