Vaishno Devi: వైష్ణోదేవి యాత్రకు వెళ్తున్నారా.. 2 ప్రత్యేక రైళ్లు ప్రారంభం.. ఎప్పటినుంచంటే?
IRCTC: ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటాయి. ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉత్తర రైల్వే ఢిల్లీ నుంచి కత్రాకు రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
Indian Railways: మీరు వేసవిలో వైష్ణో దేవిని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే, ఇండియన్ రైల్వే మీకోసం పలు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వైష్ణోదేవికి వెళ్లే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, రెండు ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ నుంచి కత్రాకు రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని ఉత్తర రైల్వే నిర్ణయించింది.
ఢిల్లీ నుంచి కత్రా..
రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రయాణికులు ఇప్పుడు ఢిల్లీ నుంచి కత్రాకు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఢిల్లీ నుంచి కత్రా వరకు చాలా రైళ్లు క్రమం తప్పకుండా నడుస్తాయి. కానీ, ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ రైళ్లలో ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోంది. కొత్త ప్రత్యేక రైళ్ల నిర్వహణతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన సీట్లు లభించడంతో పాటు దర్శనానికి వెళ్లేందుకు వీలు కలుగుతుంది. నానాటికీ పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రాత్రిపూట ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. రైలు సమయం, మార్గాన్ని తెలుసుకుందాం..
న్యూఢిల్లీ నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా స్టేషన్ వరకు రెండు రైళ్లు నడిపిస్తున్నారు. ఈ రెండు రైళ్లు కత్రా నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్తాయి. ఈ రైళ్ల నంబర్లు 04071/04072, 04077/04078. రైళ్లలో AC, స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉంటాయి.
రైలు నం. 04071 / 04072..
రైలు నం. 04071/04072 న్యూఢిల్లీ - శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా సోనేపట్, పానిపట్, కర్నాల్, కురుక్షేత్ర, అంబాలా కాంట్, లూథియానా, జలంధర్ కాంట్, పఠాన్‌కోట్ కాంట్, జమ్ముతావి, ఉధమ్‌పూర్ స్టేషన్‌లలో ఆగుతుంది. రైలు నంబర్ 04071 న్యూఢిల్లీ నుంచి రాత్రి 11.15 గంటలకు బయలుదేరి వైష్ణో దేవి కత్రా ఉదయం 11.25 గంటలకు చేరుకుంటుంది. మే 19వ తేదీ రాత్రి నుంచి ఈ రైలు నడుస్తోంది. రైలు నంబర్ 04072 కత్రా నుంచి సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి ఉదయం 6.50 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. ఈ రైలు మే 20న బయలుదేరుతుంది.
రైలు నెం. 04077 / 04078..
రైలు నం. 04077/04078 న్యూఢిల్లీ నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రాకు రాత్రి 11.15 గంటలకు బయలుదేరుతుంది. సుమారు 12 గంటల ప్రయాణం తర్వాత ఈ రైలు ఉదయం 11.25 గంటలకు కత్రా చేరుకుంటుంది. మే 20 నుంచి రైలు ప్రారంభం కానుంది. అదే విధంగా, తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 04078 మే 21న సాయంత్రం 6.10 గంటలకు కత్రా నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది.