Indian Railways: ఇక్కడ ఏడాదిలో 15 రోజులు మాత్రమే రైళ్లు ఆగుతాయి.. దేశంలోనే విచిత్రమైన రైల్వే స్టేషన్ ఇదే
Anugrah Narayan Road Ghat Station: ఇలాంటి రైల్వే స్టేషన్‌ని మీరు ఇప్పటి వరకు అస్సలు చూసి ఉండరు. ఎందుకంటే, ఇది 15 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది.
Deserted Railway Station of Bihar: ఎన్నో రైల్వే స్టేషన్‌లను ఇప్పటికే చూసి ఉంటారు. కానీ ఇలాంటి రైల్వే స్టేషన్‌ని మీరు ఇప్పటి వరకు అస్సలు చూసి ఉండరు. ఎందుకంటే, ఇది 15 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. బీహార్‌లో ఇటువంటి రైల్వే స్టేషన్ ఒకటి ఉంది. ఇక్కడ రైలు సంవత్సరంలో 15 రోజులు మాత్రమే ఆగుతుంది. ఈ స్టేషన్ ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. దీని పేరు అనుగ్రహ నారాయణ్ రోడ్ ఘాట్ స్టేషన్. పితృ పక్షం సమయంలో రైలు ఈ స్టేషన్‌లో 15 రోజులు మాత్రమే ఆగుతుంది. మిగిలిన రోజుల్లో ఈ స్టేషన్ ఇలాగే నిర్మానుష్యంగా ఉంటుంది.
సెప్టెంబర్ 17 నుంచి 9 వరకు రైళ్లు ఆగుతాయి..
పితృ పక్షం మొదటి రోజు పున్పున్ నదిలో స్నానం చేసి తర్పణం సమర్పించే సంప్రదాయం ఉంది. ఇక్కడ, భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చే యాత్రికులు ఔరంగాబాద్‌లోని అనుగ్రహ నారాయణ్ రోడ్ ఘాట్ లేదా పున్‌పున్ ఘాట్ దగ్గర తర్పణం అందిస్తారు. అందుకే ఇక్కడ సెప్టెంబర్ 17 నుంచి 9 వరకు రైళ్లను ఆపాలంటూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
స్టేషన్ 15 రోజులు మినహా ఏడాది పొడవునా నిర్మానుష్యంగానే..
ఈ 15 రోజులు కాకుండా, ఏడాది పొడవునా ఈ స్టేషన్‌లో ఏ రైలు ఆగదు. ఈ రైల్వే స్టేషన్ చాలా ఏళ్లుగా నిర్మానుష్యంగా పడి ఉంది. ఇక్కడ టికెట్ కౌంటర్ లేదు. కానీ, పితృ పక్షం సమయంలో స్టేషన్ ప్రాముఖ్యత పెరుగుతుంది. పితృ పక్షం సమయంలో వేలాది మంది ఇక్కడికి చేరుకుంటారు. అందుకే పితృ పక్షం 15 రోజులు ఇక్కడ రైళ్లు ఆగుతాయి.