Top 6 News @ 6PM: ఆ అధికారుల పేర్లు రాసిపెట్టండి.. బీఆర్ఎస్ అధికారంలోకొచ్చాక.. కేటీఆర్ వ్యాఖ్యలు
1) అమరావతికి రైల్వే లైన్.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన
అమరావతికి 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ ను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు.రూ. 2,245 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. హైద్రాబాద్, కోల్ కతా, చెన్నైతో పాటు దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో అమరావతిని కలుపుతూ ఈ కొత్త రైల్వే ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై 3.2 కి.మీ. బ్రిడ్జి నిర్మిస్తారు. ఉత్తర, దక్షిణ, మధ్య భారత్ లోని పలు ప్రాంతాలను ఈ రైల్వే లైన్ అనుసంధానం చేయనుంది.
2) చెల్లికి అలాంటి కండిషన్ పెట్టిన వ్యక్తితో రాజకీయాలా? జగన్ ఆస్తి వివాదంపై చంద్రబాబు స్పందన
ఏపీ అభివృద్ధికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రూ. 45,300 కోట్ల నిధుల వ్యయంతో ఏపీలో నాలుగు గ్రీన్ ఫీల్డ్ రహదారులు నిర్మించనున్నట్లు సీఎం చెప్పారు. ఈ వివరాల ప్రకటించే సందర్భంలోనే వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం గురించి కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తల్లిని, చెల్లిని ఇబ్బందిపెట్టే వ్యక్తితో కలిసి రాజకీయాలు చేస్తానని తానెప్పుడూ అనుకోలేదన్నారు. రాజకీయంగా తనని విమర్శించనని మాట ఇస్తేనే ఆస్తిలో వాటా ఇస్తాను అని చెల్లెలు షర్మిళకు జగన్ కండిషన్ పెట్టారట. అందుకే ఇలాంటి వారితో రాజకీయం అటేనే సిగ్గనిపిస్తోందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
3) రైతుల కోసం పోరాటంలో జైలుకైనా సిద్ధమే - కేటీఆర్
రైతుల పక్షాన ప్రభుత్వంతో పోరాటం చేసే క్రమంలో అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించిందన్నారు. రైతులకు ఇస్తామన్న 15 వేల రైతు భరోసా ఇవ్వలేదు. మహిళలకు తులం బంగారం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా మోసం చేసిందని రైతులు పోలీసు స్టేషన్ల ముందు నిలబడితే మీ పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారులు కూడా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోమని అన్నారు. రైతులను వేధించే అధికారుల పేర్లు రాసి పెట్టాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వారి సంగతి చెబుతామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ లో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు పోరుబాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
4) వైఎస్ జగన్ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల రియాక్షన్
తనతో ఆస్తి వివాదంపై తన సోదరుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు. కుటుంబంలో సమస్యలు ఉండడం సహజమే.. కానీ, అందరి కుటుంబాల్లో అమ్మల మీద, చెల్లెళ్ల మీద కేసులు వేస్తారా అని వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు. అంతకంటే జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రాన్ని పాలించడం పక్కన పెట్టి తన తల్లి, చెల్లి గురించి ప్రచారం చేస్తున్నారని అన్నారు. అంతేకాదు, తమ కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇవన్నీ అన్ని ఇళ్లలో ఉండేవేనని చెప్పుకొచ్చారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై షర్మిల స్పందిస్తూ కుటుంబంలో సమస్యలు ఉండడం సహజమే అయినప్పటికీ అందరి ఇళ్లలో ఇలానే అమ్మల మీద, చెల్లెళ్ల మీద కేసులు వేస్తారా అని తన సోదరుడిని నిలదీశారు.
5) తీరాన్ని వణికిస్తున్న దానా తుపాన్
దానా తుపాన్ ఇవాళ రాత్రికి ఒడిషా - పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తాజా అప్‌డేట్స్ ప్రకారం దానా తుపాన్ తీరం వైపు వేగంగా కదులుతోంది. తుపాన్ తీరాన్ని సమీపిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో 1. 70 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు అధికారులు స్పష్టంచేశారు. గంటకు 100-120 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఒడిషా, పశ్చిమ బెంగాల్ లోని తీర ప్రాంత ప్రజలు దానా తుపాన్ తో వణికిపోతున్నారు.
6) చైనాతో చర్చలపై రక్షణ శాఖ మంత్రి
భారత్ - చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడం అనేది చర్చల వల్లే సాధ్యపడిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రెండు దేశాల మధ్య దౌత్యవేత్తలు అలాగే మిలిటరీ మధ్య చర్చలు జరిగాయన్నారు. చర్చలకు చొరవ తీసుకోవడంలో ఇరు దేశాల పాత్ర అంతే సమానంగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. చర్చలకు ఉండే శక్తి, గొప్పతనం ఇదేనని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.