బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తా : గుప్తేశ్వర్ పాండే
మంగళవారం స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించిన బీహార్ మాజీ డిజిపి గుప్తేశ్వర్ పాండే.. త్వరలో రాజకీయాల్లోకి వస్తానని ధృవీకరించారు. కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు..
మంగళవారం స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించిన బీహార్ మాజీ డిజిపి గుప్తేశ్వర్ పాండే.. త్వరలో రాజకీయాల్లోకి వస్తానని ధృవీకరించారు. కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది. అయితే గుప్తేశ్వర్ పాండే రెండు రోజుల కిందట.. మామూలుగానే ఉద్యోగానికి రాజీనామా చేశానని.. రాజకీయాల్లోకి రావడానికి మాత్రం కాదని అన్నారు. తాజాగా రాజకీయాల్లోకి వస్తాను, పోటీ చేస్తాను.. రాజకీయాల్లో చేరడం పాపమా? నేరస్థులు పార్లమెంటుకు వస్తున్నప్పుడు నేనెందుకు రాకూడదు అని అన్నారు. అంతేకాకుండా బిహార్‌లో తాను ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా తప్పకుండా గెలుస్తాను అని పాండే ధీమా వ్యక్తం చేశారు.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలిచి తీరతానని అన్నారు.
దాంతో బీహార్ లో పాండే వ్యాఖ్యలు ఒక్కసారిగా చర్చనీయాంశం అయ్యాయి. పాండే ఏ పార్టీలో చేరతారు? ఎక్కడినుంచి పోటీ చేస్తారు? అనే దానిపై స్పష్టత లేనప్పటికీ.. అధికార జేడీయూ లేదా బీజేపీలో చేరాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే జేడీయూ నేతలతో సంప్రదింపులు జరిపారు పాండే.. కానీ బీజేపీ నేతలతో మాత్రం మాట్లాడలేదని సమాచారం. ఇదిలావుంటే బక్సర్ జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదిలావుంటే నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలో పాండేపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శలను ఆయన కొట్టిపారేశారు. తన రాజీనామాకు ఈ కేసు కారణం కాదని స్పష్టం చేశారు.