Karnataka: సీఎం నుండి యడియూరప్పను తప్పించాలని అధిష్టానం నిర్ణయం..!!

* అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం యడియూరప్ప * కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా తెరపైకి పలువురి పేర్లు

Update: 2021-07-22 02:54 GMT

యడియూరప్ప (ఫైల్ ఫోటో)

Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు ఆరాష్ట్ర సీఎం యడియూరప్ప. మరోవైపు తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను పదవి నుంచి తప్పించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో యడియూరప్ప వారసుడు ఎవరన్న దానిపై అందరి దృష్టి మళ్లింది. పలువురి పేర్లు తెరపైకి వస్తున్నా, సీఎం రేసులో తాము ముందంజలో ఉన్నామంటూ కొందరు లీకులిస్తున్నారు.

కర్ణాటకలో కొత్త తరానికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన బీజేపీ నాయకత్వంలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియ సజావుగా సాగాలంటే యడియూరప్ప వారసుడిగా ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేని మాస్‌ లీడర్‌ కావాలని చెబుతున్నారు. ఇక అలాంటి నేతను వెతికి పట్టుకోవడం అనుకున్నంత సులభం కాదని బీజేపీ కార్యకర్తలే చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. సీఎం రేసులో ప్రహ్లాద్‌ జోషీ, సి.టి.రవి, బి.ఎల్‌.సంతోష్‌ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే జాబితాలో కొత్త పేర్లు వచ్చి చేరుతుండగా, ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తే లేదని కర్ణాటక బీజేపీలోని ఒకవర్గం వాదిస్తుండగా మార్పు తథ్యమని మరోవర్గం బల్లగుద్ది మరీ చెబుతోంది. మొత్తానికి ఇప్పుడు యడియూరప్ప వారసుడు ఎవరన్న దానిపై అందరి దృష్టి మళ్లింది.

Tags:    

Similar News