Yaas Cyclone Effect: విరుచుకుపడనున్న యాస్ తుపాన్
Yaas Cyclone Effect: యాస్ తుపాన్ ఏ రేంజ్ లో కల్లోలం సృష్టిస్తోందో అనే భయంలో మూడు రాష్ట్రాలు ఉన్నాయి.
Yaas Cyclone Effect: బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయ్. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ సైతం బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. యాస్ తుఫాన్ ఏ రేంజ్ లో కల్లోలం సృష్టిస్తోందో అనే భయంలో మూడు రాష్ట్రాలు ఉన్నాయి. బెంగాల్, ఒడిశాల మధ్యే తీరం దాటనుండటంతో.. ఆ రెండు రాష్ట్రాలకే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. నేడు హోంమంత్రి అమిత్ షా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడనున్నారు. తుఫానును ఎదుర్కొనే సంసిద్ధత విషయంలో వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.
నేటి సాయంత్రానికి తుపాన్ మొదలయ్యే అవకాశముందని అనుకుంటున్నారు. ఇప్పటికే బలపడ్డ వాయుగుండం సాయంత్రానికి తుపాన్ గా మారుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 26 సాయంత్రానికి ఉత్తర ఒడిశాలోని పారాదీప్, పశ్చిమబెంగాల్ లోని సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేటి సాయంత్రం నుంచి 27 వరకు ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కింలలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.
తీరం దాటేటప్పుడు 155 నుంచి 185 కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీచే అవకాశం ఉండటంతో.. అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉంది. భారీ నష్టం సంభవించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదానిపై ఇప్పటికే కసరత్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం స్వయంగా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా కోవిడ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ప్రధాని సూచించారు.