మాజీ సీఎంకు ఊహించని చేదు అనుభవం.. రూ. 2 లక్షలు విసిరికొట్టిన మహిళ..
Karnataka: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది.
Karnataka: కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. బాధిత కుటుంబానికి పరిహారంగా ఇచ్చిన 2 లక్షల నగదును ఆయనపైనే ఒక మహిళ విసిరేసింది. బాగల్‌కోట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 6న కెరూర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. హిందూ యువతిని వేధిస్తున్న యాసిన్ అనే ముస్లిం వ్యక్తితో హిందూ జాగారణ వేదిక కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో యాసిన్ తన అనుచరులతో కలిసి వారిపై దాడి చేశాడు. ఈ ఘటన నేపథ్యంలో హిందూ జాగారణ వేదిక కార్యకర్తలు ముస్లింలపై దాడి చేశారు. వారి ఇళ్లు, షాపులకు నిప్పుపెట్టారు. ఈ హింసాత్మక ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఇరు వర్గాలకు చెందిన 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య బాగల్‌కోట్ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. కెరూర్ హింసలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. గాయపడిన నలుగురు కుటుంబ సభ్యులకు 50 వేల చొప్పున 2 లక్షల డబ్బును నష్ట పరిహారంగా అందజేశారు. అనంతరం సిద్ధరామయ్య తిరిగి వెళ్తుండగా ముస్లిం మహిళ ఆగ్రహంతో మాకు డబ్బులు అక్కర్లేదని ఆయన ముఖం మీదే చెప్పింది. ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత పరామర్శకు రావడంపై మండిపడింది. ఆయన ఇచ్చిన డబ్బులను తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించింది. సిద్ధరామయ్య తన కారులో అక్కడి నుంచి వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లోకి డబ్బును విసిరేసింది.