Uddhav Thackeray: ఉద్ధవ్ ముందున్న దారేది?
Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయ యవనికపై శివసేన కనిపించదా?
Uddhav Thackeray: ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. పార్టీ నుంచి ఉన్న 55 మందిలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బృందంలోనే ఉండటం ఆ పార్టీ మనుగడపై అనుమానాలను పెంచుతున్నది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇక శివసేన కనిపించదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో రెండు హిందూత్వ పార్టీలు అక్కర్లేదంటూ శివసైనికులందరినీ బీజేపీ తనలో చేర్చుకుంటుందా? తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేకు సీఎం పీఠం కట్టబెట్టడంలో కాషాయ పార్టీ లక్ష్యం ఇదేనా? అంటే ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనకలిసి పోటీచేసి విజయం సాధించాయి. అయితే సీఎం పదవి కోసం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తమతో 30 ఏళ్ల బంధాన్ని తెంచుకుని, రాజకీయ శత్రువులైన NCP, కాంగ్రెస్‌తో చేతులు కలిపి మహారాష్ట్ర వికాస్ అఘాడీ సర్కారును ఏర్పాటు చేశారు. దీంతో మోడీ - షా రంగంలోకి దిగారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే భుజంపై తుపాకీ పెట్టి సగం సాధించారని చెబుతున్నాయి. షిండే వర్గం మద్దతుతో అధికారం చేపట్టే అవకాశం ఉన్నా.. ఆయనకే సీఎం పదవి ఇచ్చారు. ఇక శివసేనలో మిగిలేది మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే మాత్రమేనని.. ఆ పార్టీ పూర్తిగా షిండే చేతుల్లోకి వచ్చేలా చేయడం.. బీజేపీలో విలీనం చేసుకోవడమే మోడీ - షా ఎత్తుగడ అని విశ్లేషిస్తున్నాయి.