పూరీ జగన్నాథుని రత్న భాండాగారానికి పాములు కాపలా ఉంటాయా..?

జగన్నాథ ఆలయం రత్న భాండాగారం తలుపులను తెరవాలని నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయం తీసుకుంది.

Update: 2024-07-12 12:23 GMT

పూరీ జగన్నాథుని రత్న భాండాగారానికి పాములు కాపలా ఉంటాయా..?

పూరీ జగన్నాథ దేవాలయంలోని రత్న భాండాగారాన్ని జూలై 14న తెరవనున్నారు. 1978లో తెరిచిన తర్వాత ఇప్పటివరకు దీన్ని తెరవలేదు. 2018లో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఖజానాను తెరవాలని ప్రయత్నించారు. కానీ, అధికారులు ఉపయోగించిన తాళం చెవితో ఖజానా తలుపులు తెరుచుకోలేదు. ఆ తరువాత ఆరేళ్లకు ఈ ఖజానా తలుపులు తెరవబోతున్నారు.


 పూరీ జగన్నాథ ఆలయం రత్న భాండాగారం 46ఏళ్ళ తరువాత తెరుచుకుంటున్నాయి...

జగన్నాథ ఆలయం రత్న భాండాగారం తలుపులను తెరవాలని నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయం తీసుకుంది. ఒడిశా హైకోర్టు రిటైర్డ్ జడ్జి బిశ్వనాథ్ రాథ్ సహా 16 మంది సభ్యుల ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకుంది. పాత కమిటీని రద్దు చేయడంతో రత్న భాండాగారం తలుపులు తెరుస్తారా లేదా అనే సస్పెన్స్ నెలకొంది. అయితే కొత్తగా కొలువైన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన కమిటీ ఈ ఖజానా తలుపులు తెరవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరిజిత్ పసాయత్ నేతృత్వంలోని కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండుసార్లు సమావేశమైంది. అయితే ఒడిశాలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఈ కమిటీని రద్దు చేసి, బిశ్వనాథ్ రాథ్ కమిటీని ఏర్పాటు చేసింది.


 రత్న భాండాగారంలో రెండు గదులు

ఒకటి బయటి ఖజానా... రెండోది అంతర్గత ఖజానా

పూరీ ఆలయ గర్బగుడి సమీపంలో రత్న భాండాగారం ఉంది. ఇందులో వజ్రాలు, బంగారం, వెండితో చేసిన వస్తువులు, పుణ్యక్షేత్రానికి చెందిన అమూల్యమైన ఆభరణాలున్నాయి.11.78 మీటర్ల ఎత్తులో 8.79 మీటర్లు x 6.74 వెడల్పుతో రత్న భండార్ లో రెండు గదులున్నాయి. రత్న భాండాగారం రెండు విభాగాలుగా ఉంది. ఒక గదిని అంతర్గత ఖజానాగా పిలుస్తారు. రెండో గదిని బయటి ఖజానాగా పిలుస్తారు.1978 మే 13 జూలై 23 మధ్యలో రత్న భాండాగారాన్ని ఓపెన్ చేశారు. రెండు గదుల్లో 128.380 కిలోల నికర బరువుతో 454 బంగారు వస్తువులు, 221.530 కిలోల బరువు గల 293 వెండి వస్తువులు ఉన్నట్టుగా గుర్తించారు. అంతర్గత ఖజానాలో 43.640 కిలోల 367 బంగారు వస్తువులు, 148.780 కిలోల 231 వెండి వస్తువులున్నాయి. బయటి ఖజానాలో 84.74 కిలోల బంగారు వస్తువులు, 73.64 కిలోల వెండి వస్తువులున్నాయి. ఈ ఆభరణాలు 1893 లోనే వాడుకలో ఉన్నాయని ప్రముఖ చరిత్రకారులు ఆర్ డి బెనర్జీ అప్పట్లోనే చెప్పారు.


 1978లో రత్న భాండాగారం తలుపులు తెరిచారు... కానీ, లోపలి గది తలుపులు ఎందుకు తెరవలేదు?


పూరీ జగన్నాథ ఆలయ చట్టం ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి ఖజనాను తెరవాలి. రత్న భాండాగారంలోని రెండు గదుల్లో ఉన్న ‎ అన్ని విలువైన వస్తువులను ఆడిట్ చేయాలి. 1978 లో చివరి సారిగా ఈ ఖజానా తలుపులు తెరిచారు. అయితే ఆ సమయంలో లోపలి గది తలుపులు తెరవలేదు. ఆ తర్వాత ఇప్పటివరకు రత్న భాండాగారం తలుపులు తెరవలేదు. ఈ ఖజానా దాచి ఉంచిన గదులను గతంలో 1962-1964, 1967, 1977, 1978లలో తెరిచారు. 2018లో రత్న భాండాగారాన్ని తెరవాలని కోర్టు ఆదేశించింది.

అయితే ఖజానా గది తలుపులు తెరిచేందుకు ఉపయోగించిన తాళం చెవితో తలుపులు తెరుచుకోలేదు. దీంతో అప్పట్లో ఈ అంశం పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ రిపోర్ట్ ను ఇప్పటివరకు బయటపెట్టలేదని బీజేడీపై ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు.


పూరీ జగన్నాథ ఆలయం ఖజానాలో అంతటి విలువైన ఆభరణాలు ఎలా వచ్చాయి?

పూరీ జగన్నాథ ఆలయ ఖజానాలో విలువైన ఆభరణాలున్నాయి. కేశరి, గంగావంశాల రాజులు, సూర్యవంశీ, భోయి రాజవంశాల రాజులు, నేపాల్ పాలకులు వెండి, బంగారం, రత్నాలు, విలువైన వస్తువులు జగన్నాథుడికి విరాళంగా ఇచ్చారు. రాజు అనంగభీమదేవ్ పూరీ జగన్నాథుడికి బంగారు ఆభరణాలు సిద్దం చేయడానికి 1,25,000 తులాల  బంగారాన్ని విరాళంగా ఇచ్చారని ఆలయ చరిత్ర ను వివరించే మదాల పంజి చెబుతోంది.

సూర్యవంశీ పాలకులు జగన్నాథునికి విలువైన బంగారు ఆభరణాలు, బంగారం సమర్పించారు. గజపతిరాజు కలిపేంద్రదేవ్ 1466 ఏడీలో దక్షిణాది రాష్ట్రాలను జయించిన తర్వాత 16 ఏనుగులతో తెచ్చిన సంపదను ఆలయానికి విరాళంగా ఇచ్చారని 12వ శతాబ్దానికి చెందిన దిగ్విజయ్ ద్వార్ పై ఉన్న శాసనం తెలుపుతుంది. వీరే కాకుండా సాధారణ భక్తులు కూడా పూరీ జగన్నాథుడికి సమర్పించిన విలువైన వస్తువులను ఖజానాలో భద్రపరుస్తారు.


 ఖజానాలోని సంపద విలువను లెక్క కట్టేది ఎలా?

పూరీ జగన్నాథుడి ఆలయ ఖజానాలో బంగారు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను గుర్తించేందుకు సమర్ధులు అవసరం ఉంది. ఆడిట్ ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ఖజానాలో 1500 ఏళ్ల క్రితం ఉన్న ఆభరణాలు, నగలు కూడా ఉన్నాయని బిశ్వనాథ్ రాథ్ చెప్పారు. అయితే, ఈ ఆభరణాలు గుర్తించేందుకు నిపుణులైన స్వర్ణకారులు, మెట్రాలజిస్టుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.


 పూరీ జగన్నాథ ఆలయం ఖజానా ఎవరి అధీనంలో ఉంటుంది?

పూరీ జగన్నాథ ఆలయ వ్యవహరాలను పర్యవేక్షించేందుకు మేనేజింగ్ కమిటీని 1960 అక్టోబర్ 27న ఏర్పాటు చేశారు. ఆలయ వ్యవహారాలను చక్కబెట్టేందుకు కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఐదో రూల్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధిష్ట ఆదేశాలు లేకుండా ఖజానాలోని విలువైన వస్తువులను బయటకు తీయవద్దు. ఆలయ నియమాలు 1960 ప్రకారంగా ఖజానాలోని ఆభరణాలను ప్రతి ఆరు మాసాలకు ఒక్కసారి తనిఖీ చేయాలి. ఆభరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు,ఆడిట్ ఎలా నిర్వహించాలి, తాళం చెవి ఎవరి వద్ద ఉండాలనే అంశాలు ఈ నియమాల్లో స్పష్టంగా వివరించారు.


 రత్న భాండాగారంలో మూడు కేటగిరీలు… ఏ కేటగిరీలో ఏముంది?

పూరీ జగన్నాథ ఆలయంలోని ఖజానాలో ఉన్న విలువైన వస్తువులను మూడు రకాలుగా వర్గీకరించారు. ఎప్పుడూ ఉపయోగించని వాటిని కేటగిరి-1 కింద చేర్చారు. పండుగల సందర్భంగా ఉపయోగించే వాటిని కేటగిరి-2 కింద, దేవతలకు రోజువారీ ఉపయోగం కోసం ఉపయోగించే వాటికి కేటగిరి-3 కింద విభజించారు. రూల్ 6 ప్రకారంగా మొదటి కేటగిరి లో వస్తువులు డబుల్ లాక్ లో ఉంటాయి. మూడు కేటగిరిల కింద ఉన్న విలువైన వస్తువులు, వాటి తాళం చెవుల భద్రపర్చే విషయాలను నియమ నిబంధనల్లో స్పష్టంగా వివరించారు.


 పూరీ ఆలయ ఖజానాకు… పాములు కాపలా ఉంటాయా?

పూరీ జగన్నాథ ఆలయ ఖజానాకు పాములు రక్షణగా ఉంటాయని పురాణాలు, జానపద కథలు చెబుతున్నాయి. ఈ నెల 14న ఖజానాను తెరుస్తున్నందున ఆలయ కమిటీ జాగ్రత్తలు తీసుకుంటుంది. స్నేక్ క్యాచర్స్ తో పాటు  పాము కాటుకు వైద్యం చేసే వైద్య బృందం కూడ సిద్దంచేశారు. ఖజానాను చివరిగా జూలై 14, 1985న బలభద్ర స్వామికి బంగారు ఆభరణాన్ని తిరిగి పొందేందుకు తెరిచారు. అయితే ఈ ఖజానాలో విలువైన వస్తువుల ఆడిట్ మాత్రం మే 13 నుండి జూలై 23, 1978 వరకు నిర్వహించినట్టుగా ఆలయ రికార్డులు చెబుతున్నాయి.

పూరీ జగన్నాథ ఆలయానికి చెందిన ఖజానాలో ఏమున్నాయనే విషయం ఈ నెల 14న ప్రపంచానికి తెలియనుంది. గతంలో ఉన్న రికార్డులను పరిశీలిస్తూ ఖజానాలోని విలువైన వస్తువుల జాబితాను సరిపోలుస్తారు. మొత్తం సంపద విలువను లెక్కిస్తారు.

Full View


Tags:    

Similar News