అసలు శివసేన ఎవరిది..? ఏక్ నాథ్ షిండే శివసేనను లాక్కుంటారా..?

Maharashtra: మహా సస్సెన్స్ అంతకంతకూ పెరిగిపోతోంది.

Update: 2022-06-22 12:03 GMT

అసలు శివసేన ఎవరిది..? ఏక్ నాథ్ షిండే శివసేనను లాక్కుంటారా..? 

Maharashtra: మహా సస్సెన్స్ అంతకంతకూ పెరిగిపోతోంది. క్షణం క్షణం మారిపోతున్న రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ఉండటం ఇష్టం లేక ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో అసంతృప్త ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో మహా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గుజరాత్ నుంచి గౌహతికి శిబిరాన్ని మార్చిన రెబల్స్ అక్కడి నుంచి మహా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను పంపించారు. మొత్తం 34 మంది సంతకాలు ఉండటంతో తిరుగుబాటు శిబింరలో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారనే దానిపై స్పష్టత వచ్చింది. ఇందులో భరత్‌ గోగ్వాలేను చీఫ్‌ విప్‌గా నియమించామని షిండే తెలిపారు. అయితే 2019 ఎన్నికల్లో 56 స్థానాల్లో పాగా వేసిన అధికార శివసేనలో 22 మంది మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఏక్ నాథ్ షిండే ఏకంగా శివసేన పార్టీ తనదే అనే స్టేట్ మెంట్ ఇచ్చేశారు. దీంతో అసలు శివసేన ఎవరిది..? అనే ప్రశ్న ఉదయిస్తోంది.

ఇలాంటి రాజకీయాలు దేశంలో ఏదో రాష్ట్రంలో జరుగుతూనే ఉంటాయి. తెలుగునాట అప్పట్లో సంచలనం సృష్టించిన తెలుగుదేశం సంక్షోభం ఎవరూ మర్చిపోలేరు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు ఇలాగే తిరుగుబాటు చేశారు. వైశ్రాయ్ హోటల్ లో క్యాంపు రాజకీయాలు నడిపించారు. ఆ సమయంలో చంద్రబాబు కూడా తెలుగుదేశం పార్టీ తనదే అని ప్రకటించారు. చివరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకే సొంతమైంది. మొన్నటికి మొన్న తెలంగాణలో కూడా ఇలాంటి రాజకీయాలే నడిచాయి. 2019 లో కాంగ్రెస్ శాసనసభ్యుల్లో చీలిక వచ్చింది. 12 మంది తిరుగుబాటు దారులు తమదే అసలైన సీఎల్పీ అని ప్రకటించారు. వారంతా కలిసి అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. 12 మంది సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. మెజార్టీ తమవైపే ఉందని సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరి ఇప్పుడు ఏక్ నాథ్ షిండే చెబుతున్నట్లు శివసేన తనదేనా..? అసెంబ్లీలో మెజార్టీ సభ్యులు కోరితే పార్టీ తమదే అని ప్రకటించుకోవచ్చా..? తిరుగుబాటుదారులపై పార్టీ ఫిరాయింపుల నిరోదక చట్టం కింద చర్యలకు అర్హులవుతారా..? వాస్తవానికి ఒక రాజకీయ పార్టీ మొత్తం శాసనసభ్యుల్లో 2/3 వ వంతు మంది మరో రాజకీయ పార్టీలో చేరినా లేదా స్వతంత్రంగా వేరొక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నా వారికి పార్టీ ఫిరాయింపుల నిరోదక చట్టం కింద అనర్హులుగా ప్రకటించరాదని చట్టంలో స్పష్టంగా చెప్పబడింది. దీంతో ఏక్ నాథ్ షిండే వర్గంపై ఈ చట్టం ఎలాంటి ప్రభావం చూపబోదని తెలుస్తోంది. సీఎం ఉద్దవ్ ఠాక్రే తిరుగుబాటుదారులను అనర్హులుగా ప్రకటించేలా ప్రయత్నాలు చేసే కన్నా అసెంబ్లీ రద్దుకే మొగ్గుచూపు అవకాశం ఉంది. 

Tags:    

Similar News