కాంగ్రెస్ పార్టీ మరో 50 ఏళ్లు ప్రతిపక్షంలోనే.. ఆ పార్టీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు
Will be in Opposition for 50 Years: Gulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఖరిపై మరోసారి గులాంనబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరగాలని ఎన్నికల ద్వారానే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని అన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగకుంటే మరో 50 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడే కాదు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలోనూ ఎన్నికల ద్వారానే అధ్యక్షుడిని ఎన్నుకోవాలని స్పష్టం చేశారు. అంతేకాని నేరుగా నియమించడంతో పార్టీకి నష్టం జరుగుతుందన్నారు ఆజాద్.
నేరుగా ఎంపికైన అధ్యక్షులకు పార్టీలో ఒక శాతం మంది మద్దతు కూడా ఉండకపోవచ్చని ఎన్నికల ద్వారా ఎన్నికైన అధ్యక్షుడికి 51శాతం మద్దతు ఉంటుందని తెలిపారు. సీడబ్ల్యూసీ కమిటీ సమావేశం జరిగిన మూడు రోజుల అనంతరం ఆజాద్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గత సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. సీనియర్ల లేఖపై రాహల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడం, సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ వంటి వారు రాహుల్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేయడం.. ఇలా దాదాపు ఏడు గంటలపాటు సమావేశం సాగింది. చివరకు అందరు నేతలు ఒకేమాటపైకి రావడంతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగింది.