ఒకరికే ఒటేసేలా ఈవీఎంల రూపకల్పన.. రాష్ట్రపతి ఎన్నికల్లో వినియోగించని ఈవీఎంలు.. దామాషా పద్ధతిలో ఓటింగ్
*పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే... ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల వినియోగం
Presidential Election 2022: ఎన్నికలు ఏవైనా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్-ఈవీఎం ద్వారా నిర్వహించడం చూస్తూనే ఉన్నాం. ఓడినవారు ఈవీఎంలను విమర్శించడం సర్వసాధారణంగా మారింది. కానీ ప్రథమ పౌరుడిని ఎన్నుకునే రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఈవీఎంలను వినియోగించడం లేదు. బ్యాలెట్ పేపరు పద్ధతిలోనే ఓటింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రాల్లోనూ ఢిల్లీలోనూ ఎమ్మెల్యేలు, ఎంపీలు తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ పేపరు పద్ధతిలోనే ఓటేశారు. అయితే ఈవీఎంలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలే అందుకు కారణమా? అంటే కానే కాదు దానికి కారణం ఉంది. అదేమిటో మీరే తెలుసుకోండి.
2004 నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా ఓటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు నాలుగు సార్లు లోక్‌సభకు, దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు 127 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు అన్నింటిలోనూ ఈవీఎంల ద్వారానే ఓటింగ్ జరిగింది. నియోజకవర్గం బరిలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నా తమకు ఇష్టమైన నేతకు మాత్రమే ఓటేసే అవకాశం ఈవీఎంల్లో ఉంటుంది. ఈవీఎంలోని మీట నొక్కితే ఇక ఓటేసే పని అయిపోయినట్టే అందేకాదు మరో అభ్యర్థికి రెండో ప్రాధాన్య ఓటును వేసే ఆప్షన్ ఉండదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పూర్తిగా సాంకేతిక పరిజ్ఞాణంతో పనిచేసే పరికరాలు. ఓటేసిన తరువాత వాటన్నింటిని ఒక దగ్గరకు చేర్చి ఓట్లను సులభంగా లెక్కిస్తారు. అందులో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో ఈజీగా తెలిసిపోతుంది. ఫలితాలు కూడా వెంటనే ప్రకటిస్తారు. అయితే వీటిని హ్యాకింగ్ చేస్తున్నారని ఎవరికి ఓటేసినా ఒకరికే పడుతున్నాయన్న విమర్శలు ఓడిపోయిన పార్టీలు చేస్తూనే ఉన్నాయి. బ్యాలెట్ పేపరు పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్లు కూడా వినిపిస్తుంటాయి.
రాష్ట్రపతి ఎన్నిక విధానం వేరుగా ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఒక అభ్యర్థికే ఓటేయాలనే నిబంధన ఉండదు. ఎన్నికల్లో పోటీపడుతున్న అభ్యర్థులకు ప్రాధాన్యతా క్రమంలో ఓటేసే అవకాశం ఉంటంది. అంటే మొదటి, రెండో, మూడో ప్రాధాన్యతలు ఉంటాయి. అందుకే ఈ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించరు. చివరికి 50 శాతం కంటే ఎక్కువ ప్రాధాన్యత ఓట్లు పడిన వ్యక్తిని ఇక్కడ విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ మొదటి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరూ గెలవకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా ఆయా అభ్యర్థులకు బదిలీ చేస్తారు. ఇలా అభ్యర్థికి 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చేవరకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ, రాష్ట్రాల్లో శాసన మండలి సభ్యుల ఎన్నికలు కూడా ఈ పద్ధతిలోనే జరుగుతాయి. తాజాగా నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికలో రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులకు ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటును వేశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తారు. బ్యాలెట్ పేపర్లలోని రెండో కాలంలో మన ఇష్టాన్ని బట్టి మొదటి, రెండో, మూడో ప్రధాన్యతా ఓట్లు వేయొచ్చు. కానీ ఈవీఓంలో ఒకరికి మాత్రమే ఓటేసే అవకాశం ఉంటుంది. ప్రాధాన్యతా క్రమంలో ఓటింగ్ ఉండదు. అందుకే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ, శాసన మండలి అభ్యర్థులకు ప్రాధాన్యతా ఓటేయొచ్చు. ఒకవేళ ఈవీఎంలను వాడాలంటే అందుకు తగినట్టుగా సాఫ్ట్‌వేర్‌ను మార్చాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించేందుకు అణువుగా లేవని అధికారులు చెబుతున్నారు. అందుకు ప్రస్తుతం ఈవీఎంల్లో వాడుతున్న సాప్ట్‌వేర్ ఏమాత్రం సరిపోదంటున్నారు. దామాషా పద్ధతికి అనుగుణంగా భిన్నమైన సాఫ్ట్‌వేర్ రూపొందించాల్సి ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. సింపుల్‌గా చెప్పలాంటే ఇప్పుడున్న ఈవీఎంలు ఏమాత్రం సరిపోవని కొత్తగా తయారు చేయాలని చెబుతన్నారు.
ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో 1977లో తొలిసారి హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ -ఈసీఐఎల్ తయారుచేసింది. 1980 ఆగస్టు 6న తొలిసారి రాజకీయ పార్టీల ప్రతినిధుల ముందు ప్రదర్శించింది. మరో ప్రఝభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్-బీఈఎల్‌తో ఈసీఐఎల్ కలిసి ఈవీఎంలను కొత్తగా రూపొందించాయి. 1982లో కేరళలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను తొలిసారి ఉపయోగించారు. అయితే వీటి వినియోగానికి సంబంధించి నిర్ధిష్టమైన చట్టమేదీ లేకపోవడంతో ఆ ఎన్నికలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే 1989లో పార్లమెంట్ ప్రజాపాతినిధ్య చట్టం-1951ని సవరించారు. పదేళ్ల తరువాత 1998లో చట్టసవరణపై ఏకాభిప్రాయం కుదిరింది. ఆ తరువాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలోని 25 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఈవీఎంలను వినియోగించారు. 2001లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వినియోగించారు. అప్పటి నుంచి ఎన్నికల కమిషన్ ఈవీఎంలను వినియోగిస్తోంది.
2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని 543 ఎన్నికల్లో తొలిసారి 10 లక్షలకు పైగా ఈవీఎంలను ఉపయోగించారు. నాటి నుంచి లోక్‌సభ, అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగిస్తున్నారు. అయితే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ, శాసన మండలి ఎన్నికలకు మాత్రం ఈవీఎంలను వినియోగించడం లేదు.