WHO: ఉప్పు ఎక్కువైతే.. ముప్పు తప్పదు: డబ్ల్యూహెచ్‌ఓ
World Health Organisation: అన్ని వేసి చూడు.. నన్ను వేసి చూడు అని ఉప్పు గురించి పెద్దలు అంటుంటారు.
World Health Organisation: అన్ని వేసి చూడు.. నన్ను వేసి చూడు అని ఉప్పు గురించి పెద్దలు అంటుంటారు. నిజమే... ఉప్పు వేయకపోతే.. ఆ వంట వృధానే కదా. ముఖ్యంగా మన దగ్గర ఉప్పు లేని భోజానాన్ని ఊహించలేం. కానీ, డాక్టర్లు మాత్రం ఉప్పు వాడొద్దనే చెప్తారు. మానలేమంటే మాత్రం.. కొద్దికొద్దిగా తగ్గించుకోవమని సలహాలు ఇస్తుంటారు. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయాలను చూస్తే మాత్రం.. ఉప్పు వాడకాన్ని మనం కొద్దిగానైనా తగ్గించే పనిలో ఉంటామనేది నిజం.
ఉప్పు అధికంగా తీసుకుంటే ముప్పు తప్పదని డబ్ల్యూహెచ్‌ఓ గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఆహార పదార్థాల్లో సోడియం కంటెంట్‌ను బాగా తగ్గించాలని సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా సరైన పోషణ లేక 11 మిలియన్ల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు వెల్లడించింది. వీరిలో సుమారు 30 లక్షల మంది అధిక సోడియం వాడకం వల్ల చనిపోతున్నారని పేర్కొంది. అనేక దేశాల్లో ఉప్పు వాడకం విపరీతంగా పెరిగినట్లు తెలిపింది.
రోజు తీసుకునే ఆహారమైన రొట్టె, తృణధాన్యాలు, మాసం, జున్నుతో సహా ఇతర పాల ఉత్పత్తుల ద్వారా సోడియం తీసుకుంటున్నారని పేర్కొంది. సోడియం క్లోరైడ్.. మన శరీరంలోని నీటి పరిమాణాన్ని నియంత్రించే ఖనిజం. ఉప్పు పరిమితిని తగ్గించేలా, అలాగే సరైన ఆహార పదర్థాలను ఎంచుకునేలా అధికారులు సరైన సమాచారాన్ని ప్రజలకు అందించాలని సూచించింది.