India Strain: భారత్ స్ట్రెయిన్ చాలా ప్రమాదకరం...
India Strain: భారత్‌లో కరోనా వ్యాప్తి పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
India Strain: భారత్‌లో కరోనా వ్యాప్తి పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం రెండో దశ వ్యాప్తికి కారణమవుతోన్న B.1.617 వేరియంట్‌ను భారత్‌లో తొలిసారిగా అక్టోబరులోనే గుర్తించారని డబ్ల్యూహెచ్ఓ కోవిడ్ విభాగం చీఫ్ మారియా వాన్ కేర్ఖేవే తెలిపారు. గతేడాది కరోనా మొదలైన తర్వాత ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 1,200కు పైగా స్ట్రెయిన్‌లను జన్యు విశ్లేషణ ద్వారా గుర్తించినట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం B.1.617 వేరియంట్ అత్యంత ప్రమాదకారని, మేము దీనిని ప్రపంచ స్థాయి వైవిధ్యంగా వర్గీకరిస్తున్నామని అన్నారు. ఇతర రకాలతో పోలిస్తే ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. భారత్‌లో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడానికి బీ.1.617 కారణమని అంచనా వేసింది. B.1.617 వైరస్ రకం కేసులు మూడు రోజుల కిందట శ్రీలంక, బంగ్లాదేశ్‌లోనూ వెలుగు చూశాయి. దీంతో ఆయా దేశాల అధికారులు వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టారు.
ఈ వేరియంట్‌పై జరిగిన అధ్యయనాలు 'కొంతమేర తటస్థీకరణగా ఉన్నట్టు సూచిస్తున్నాయి', కోవిడ్ యాంటీబాడీలు ఈ వేరియంట్‌పై తక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయని వివరించారు. ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్ ప్రభావాన్ని మరింత అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ నొక్కి చెప్పింది. ప్రస్తుత డేటా ఆధారంగా ఈ వేరియంట్‌తో బాధపడుతున్న వ్యక్తులలో మరణాన్ని నివారించడంలో టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని మారియా తన ప్రకటనలో పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని డబ్ల్యూహెచ్ఓ ప్రతి మంగళవారం వెల్లడించే కోవిడ్ ఆప్‌డేట్స్‌లో తెలియజేయనున్నట్టు వివరించారు. భారత్‌లో ఉత్పరివర్తనం చెందిన B.1.617 వైరస్ రకం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు కనీసం 17 దేశాల్లో ఈ కరోనా వేరియంట్ వైరస్ రకాన్ని గుర్తించినట్లు పేర్కొంది. B.1.617 డబుల్ మ్యుటెంట్‌ను తొలిసారిగా భారత్‌లో బయటపడగా.. యూకే, సింగపూర్ సహా పలు దేశాల్లో దీనిని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.