Delta Variant: 98 దేశాల్లో డెల్టా వేరియంట్…డబ్ల్యుహెచ్ఓ
Delta Variant: ప్రపంచం క్లిష్ట సమయంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఆందోళన వ్యక్తం చేశారు
Delta Variant: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా అనేక రూపాలను సంతరించుకుంటూ వణికిస్తోంది. ప్రస్తుతం డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తిస్తూ.. ఆందోళన కలిస్తుందని.. 98 దేశాల్లో ఈ వేరియంట్ ను గుర్తించామని,ఇంకా చెప్పాలంటే ప్రపంచం క్లిష్ట సమయంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రాయాసిస్ చెప్పారు. కరోనా కట్టడికి నిరంతర పరిశీలన అవసరమని, ప్రజారోగ్య ప్రతిస్పందనను సరిగ్గా నిర్వహించాలని సూచించారు. ఈ వేరియంట్ వ్యాక్సినేషన్ కు సంబంధం లేకుండా వ్యాప్తి చెందుతుందని.. అంతేకాదు సరికొత్త రూపం సంతరించుకుని.. మరింత విజృంభిస్తుందని .. అది చాలా ప్రమాదకరమని టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కొత్త వైరస్‌ను తరిమికొట్టేందుకు రెండు మార్గాలున్నాయని డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ చెప్పారు. ముఖ్యంగా ప్రతి ఒక్కదేశం ప్రజారోగ్యం, సామాజిక చర్యలు పటిష్టమైన నిఘా పై దృష్టి పెట్టాలని సూచించారు. అంతేకాదు త్వరగా కేసులను గుర్తించడం, ఐసోలేషన్, క్లినికల్ కేర్ , మాస్క్, భౌతిక దూరం, రద్దీ ప్రదేశాల్లో సమూహాలను నివారించడం, ఇండోర్ ప్రాంతాలు వెంటిలేషన్ సదుపాయాలు చూసుకోవడం ఉండాలని అన్నారు.
ఈ డెల్టా వేరియంట్ ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఆక్సిజన్, కరోనా పరీక్షలు, చికిత్స, వ్యాక్సిన్లు సమానంగా షేర్ చేసుకోవాలని టెడ్రోస్ సూచించారు. ఈ వైరస్ ను అరికట్టడానికి అన్ని దేశాలు సహకరించుకోవాలని సూచించారు. అంతేకాదు 2022 జూలై వచ్చే సరికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో దాదాపు 70 శాతం వ్యాక్సినేషన్ వేయించుకునేలా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మహమ్మారిని ప్రపంచ దేశాలనుంచి తరిమి కొట్టడానికి… ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకునేందుకు ఇవే సరైన మార్గాలని చెప్పారు. ఈ సెప్టెంబర్ నాటికి మీ దేశ జనాభాలో 10 శాతం మందికైనా వ్యాక్సిన్ అందించాలని పలు దేశాలకు విజ్ఞప్తి చేశారు.