whatsApp కు పోటీగా Sandes యాప్
వాట్సాప్ తరహా ఫీచర్స్‌తో దేశీయ ఇన్‌స్టా మెసేజింగ్ యాప్ సందేశ్
WhatsApp: వాట్సాప్ కు పోటీగా కేంద్ర ప్రభుత్వం కొత్త యాపను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ తరహా ఫీచర్స్‌తో దేశీయ ఇన్‌స్టా మెసేజింగ్ యాప్ సందేశ్ (Sandes)ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) అభివృద్ధి చేసింది. గతంలో ప్రభుత్వ అధికారులు అంతర్గత సమాచార బట్వాడా కోసం ఉపయోగించిన గవర్నమెంట్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ సిస్టం (జిమ్స్)లో మార్పులు చేసి సందేశ్ యాప్‌ను తీసుకొచ్చారు. జిమ్స్ అంటే గవర్నమెంట్ ఇన్ స్టాంట్ మెసేజింగ్ సిస్టమ్ అని అర్థం. జిమ్స్ యాప్ లో పలుమార్పులు చేసిన ఎన్ఐసీ సందేశ్ గా మార్చి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది.
సందేశ్ యాప్ ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు పోటీ ఇస్తుందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. మెయిల్ ద్వారా ఖాతా ప్రారంభించాలంటే ఇప్పట్లో వీలు కాదు. ప్రభుత్వ అధికారిక మెయిల్ ఐడీలు ఉన్నవాళ్లు మాత్రమే మెయిల్ ఐడీ సాయంతో సందేశ్ ఖాతాలు ప్రారంభించవచ్చు. జీమెయిల్, యాహూ వంటి ప్రైవేటు డొమైన్ మెయిల్ ఐడీలకు సందేశ్ యాప్ అనుమతి నిరాకరిస్తుంది.
ఖాతా తెరిచిన తర్వాత వాట్సాప్ తరహాలోనే ఛాటింగ్, ఆడియో/వీడియో కాల్స్, ఫైల్, కాంటాక్ట్ షేరింగ్ చెయ్యొచ్చు. యూజర్స్ సమాచార గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా సందేశ్‌లో కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ఇచ్చారు.
ఈ యాప్‌లో ఫోన్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీ మార్చుకునే అవకాశం లేదు. ఒకవేళ ఫోన్ నంబర్ మార్చుకోవాలంటే పాత ఖాతా డిలీట్ చేసి, కొత్త ఫోన్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీతో కొత్తగా ఖాతా తెరవాలి. అయితే వాట్సాప్‌లో మాత్రం ఫోన్ నంబర్ మార్చుకునే సదుపాయం ఉంది.
వాట్సాప్ తరహాలో సందేశ్ యాప్ ఉపయోగించమని కోరుతూ ఎవరికీ రిక్వెస్ట్ మెసేజ్ పంపలేం. అవతలి వ్యక్తులు కూడా సందేశ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటేనే ఇద్దరి మధ్య ఛాటింగ్ సాధ్యపడుతుంది.
ఇది దాదాపుగా వాట్సాప్ అందించే సేవలన్నింటిని అందిస్తుంది. పైగా ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ భద్రత కూడా కల్పిస్తున్నారు. కాగా, త్వరలోనే కేంద్రం సంవాద్ అనే మరో మెసేజింగ్ యాప్ ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. న్యూస్ ఫీడ్, మల్టీ యూజర్ చాట్ సెషన్స్, ప్రైవేటు సోషల్ నెట్వర్కింగ్ వంటి అదనపు ఫీచర్లు దీంట్లో ఉంటాయని తెలుస్తోంది.