Exit Poll 2024: ఎగ్జిట్ పోల్స్‌లో ఏముంది?
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఈరోజుతో పూర్తవుతుంది. ఏపీలో, తెలంగాణలో పోలింగ్ ఒకే దశలో మే 13న జరిగింది.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఈరోజుతో పూర్తవుతుంది. ఏపీలో, తెలంగాణలో పోలింగ్ ఒకే దశలో మే 13న జరిగింది. ఇప్పుడు అందరి చూపు ఫలితాలపైనే. అయితే, కౌంటింగ్ మొదలు కాకముందే వచ్చే ప్రజల నాడిని పసిగట్టే ప్రయత్నం చేస్తుంటాయి ఎగ్జిట్ పోల్స్. పోలింగ్ పూర్తి కాగానే ఎగ్జిట్ పోల్స్ విడుదల కావడం ఇప్పుడొక ట్రెండ్‌గా మారింది. రాజకీయ పార్టీలు, పోటీ చేసిన అభ్యర్ధులు, ఎన్నికల వ్యూహాకర్తలు ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందా? కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బీజేపీని ఢీకొడుతుందా? ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాలను ఎగ్జిట్ పోల్స్ ద్వారా తేలనున్నాయి. ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా, చాణక్య, టైమ్స్ నౌ- ఈటీజీ, సీ-ఓటర్, సీఎస్డీఎస్-లోక్ నీతి సంస్థల ఎగ్జిట్ పోల్స్ శనివారం నాడు విడుదల కానున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి?
ఎగ్జిట్ పోల్స్ అంటే పోలింగ్ తర్వాత నిర్వహించే సర్వే. పోలింగ్ రోజున ఓటర్ మూడ్ ఆధారంగా వెల్లడించే ఫలితంగా కూడా చెబుతారు. ఆయా రాష్ట్రాలు, ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీ లేదా ఏ అభ్యర్ధి విజయం సాధిస్తారనే విషయాలను చెప్పడాన్ని ఎగ్జిట్ పోల్స్ గా పిలుస్తారు. ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినట్టుగా ఫలితాలుంటాయని కూడా చెప్పలేం. గతంలో కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా వాస్తవ ఫలితాలు వచ్చాయి.
ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడంటే?
శనివారం నాడు సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు విడుదల చేయనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 19న ఉదయం ఏడు గంటల నుండి జూన్ 1న సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం విధించింది. ఏడు విడతల్లో దేశంలో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17న తొలి విడత ఎన్నికలు జరిగాయి. జూన్ 1న చివరి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. దేశంలోని 543 ఎంపీ స్థానాలతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించారు.
జూన్ 2న అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్ సభతో పాటే ఎన్నికలు నిర్వహించారు. జూన్ రెండున అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
ఏపీ అసెంబ్లీ ఫలితాలపై అందరి చూపు
తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది మే 13న పోలింగ్ జరిగింది. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా రెండోసారి వైఎస్ఆర్సీపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా....టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికార పీఠాన్ని చేరుకుంటుందా అనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్ సాగుతుంది. మరోసారి ఏపీలో అధికారంలోకి వస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు ధీమాగా ఉన్నారు. టీడీపీ కూటమి నేతలు కూడా అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.