ఏపీ సీఎం జగన్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మధ్యలో తమిళ స్టార్ హీరో విజయ్. ఈ ముగ్గురూ వున్న ఒక పోస్టర్, ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకిలాంటి పోస్టర్ వేశారంటూ, అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే, ఆ పోస్టర్ వెనక చాలా పెద్ద కథే వుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ ఏంటా స్టోరి?
కనిపిస్తున్న పోస్టర్ చూశారా. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మధ్యలో తమిళ స్టార్ హీరో విజయ్. జగన్, పీకే ఇద్దరూ కలిసి, విజయ్‌కు ఏదో చెబుతున్నట్టు వుంది కదా పోస్టర్‌లో వున్న తమిళ అక్షరాలు కూడా అదే చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను మేం కాపాడుకున్నాం ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడును మీరే కాపాడాలంటూ జగన్, పీకేలు విజయ్‌కు చెబుతున్నట్టు వుంది పోస్టర్. తమిళనాడులో ఇప్పటికే విజయ్ చుట్టూ రాజకీయ ప్రకంపనలు అలజడి రేపుతున్న వేళ, తాజాగా ఈ పోస్టర్ చర్చనీయాంశమైంది.
మధురైలో విజయ్ అభిమానులు కొందరు ఈ పోస్టర్లను అతికించినట్లు తెలుస్తోంది. ఇదేదో ఆకతాయిల పనైనట్టుగా అనిపిస్తున్నా, దీని వెనక అర్థాలు చాలా వున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హీరో విజయ్ నివాసాలపై ఇటీవలే ఆదాయపన్ను అధికారులు రైడ్స్ చేశారు. ఆయనకు నోటీసులు కూడా అందించారు. దీనిపై విజయ్ చేసిన కామెంట్లు మరింత కాక రేపాయి. రజినీకాంత్‌లా CAAకు అనుకూలంగా మాట్లాడి, IT దాడుల నుంచి తప్పించుకోగలను, కానీ తాను భారత రాజ్యాంగానికి బద్దున్ని అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు రచ్చరచ్చ చేశాయి. అయితే తమ అభిమాన హీరోను బీజేపీ కావాలనే టార్గెట్ చేసిందని ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో ఇప్పడు తమిళనాడులో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని తొలగించాలంటే హీరో విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అందుకే మధురైతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పోస్టర్లు వెలుస్తున్నాయి.
ఎన్నికల టైంలో ఆంధ‌్రప్రదేశ్ ఎన్నికల్లో, జగన్‌తో కలిసి వ్యూహప్రతివ్యూహాలకు పదునుపెట్టారు ప్రశాంత్ కిశోర్. నవరత్నాల రూపకల్పన, ప్రచార సరళి, సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌తో వైసీపీని జనాలకు మరింత చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఢిల్లీలో కేజ్రీవాల్‌కు లగేరహో కేజ్రీవాల్ అన్న నినాదాన్ని అందించిన పీకే, ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ రావాలి జగన్, కావాలి జగన్, నినాదాన్ని మార్మోగేలా చేశారు. ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్‌లో చాణక్యుడు ప్రశాంత్ కిశోర్. ఈ నేపథ్యంలో తమిళనాడులోనూ పీకేతో కలిసి, విజయ్ రాజకీయాలను రంగరించాలని కోరుకుంటున్నారు, హీరో అభిమానులు.
విజయ్-బీజేపీ సమరం ఇఫ్పటిది కాదు. చాలాకాలం నుంచి సాగుతున్నదే. అదిరింది మూవీలో, బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ పెట్టారు విజయ్. చిన్న పిల్లలకు ఆక్సిజన్ అందించలేని, చేతకాని ప్రభుత్వాలంటూ, యూపీ యోగి సర్కారుపై పరోక్షంగా చెలరేగిపోయారు. దీనిపై వివాదం సాగడంతో, చివరికి ఆ డైలాగ్‌ను కట్ చేశారు. ఇఫ్పుడు తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు, రజినీకాంత్, కమల్‌హాసన్‌లు ప్రయత్నిస్తున్నారు. రజినీకాంత్ అయితే, బీజేపీతో కలిసి సాగేందుకు సంకేతమిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తమిళనాడులో విశేష అభిమానులున్న విజయ్ సైతం, పాలిటిక్స్‌లోకి రావాలన్న డిమాండ్ పెరుగుతోంది. అందుకే రజినీకాంత్‌కు ఎక్కడ పోటీ అవుతాడోనని భావిస్తున్న బీజేపీ, విజయ్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతోందన్న చర్చ జరుగుతోంది. విజయ్‌పై క్రిస్టియన్ అన్న ముద్ర వేసేందుకు, బ్లాక్‌మనీ దాచుకున్నాడని ఆరోపించేందుకు అన్ని అస్త్రాలనూ సంధిస్తోందన్న మాటలు వినపడ్తున్నాయి.
మొత్తానికి విజయ్ సైతం రాజకీయాల్లోకి రావాలని తపిస్తున్న అభిమానులు, విజయాల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కలిసి పని చేయాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకే అక్కడక్కడా పోస్టర్లు అతికిస్తున్నారు. పీకే, విజయ్‌లిద్దరికీ బీజేపీ ఉమ్మడి శత్రువు కావడంతో, ఇద్దరూ కలిసి ఏపీ, ఢిల్లీ తరహాలో విజయఢంకా మోగించాలని అభిలషిస్తున్నారు. చూడాలి, తమిళనాడు రాజకీయాల్లో మున్ముందు ఏం జరగబోతోందో.