NEET – UG 2024: నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్ష వివాదం ఏంటి? ఫుల్ రిపోర్ట్
NEET – UG 2024: నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షలపై ప్రతి ఏటా ఏదో విషయమై గందరగోళం జరుగుతూనే ఉంది.
NEET – UG 2024: నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కేసులో సీబీఐ దూకుడును పెంచింది. ఈ కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో కొందరిని అదుపులోకి తీసుకోగా, మరికొందరిని సీబీఐ అరెస్ట్ చేసింది. పేపర్ లీక్ ఘటన అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. నీట్ యూజీ-2024 పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ నెల 8న విచారణ చేయనుంది.
నీట్ యూజీ 2024 వివాదం ఎలా మొదలైంది?
నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షలపై ప్రతి ఏటా ఏదో విషయమై గందరగోళం జరుగుతూనే ఉంది. ఈసారి ప్రశ్నాపత్రం లీకైంది. తొలుత పేపర్ లీక్ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తోసిపుచ్చింది. కానీ, ఆ తర్వాత ప్రశ్నాపత్రం లీకైందని గుర్తించారు. ఈ ఏడాది మే 5న దేశ వ్యాప్తంగా 4570 పరీక్షా కేంద్రాల్లో 23.33 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. కొన్ని పరీక్ష కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని ఫలితాల తర్వాత కొందరు విద్యార్థులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మే 5న పరీక్ష నిర్వహిస్తే జూలై 14న పలితాలు వెల్లడించనున్నట్టుగా ఎన్ టీ ఏ తొలుత షెడ్యూల్ ను విడుదల చేసింది. అయితే జూన్ 4న పార్లమెంట్ తో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అదే రోజున ఈ ఫలితాలను వెల్లడించారు. ఈ ఫలితాలపై అందరి దృష్టి పడకుండా ఉండేందుకే షెడ్యూల్ కంటే ముందే ఫలితాలను విడుదల చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.
ఈసారి 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రంలోని ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులు వచ్చాయి. మరో వైపు కొందరు విద్యార‌్థులకు గ్రేస్ మార్కులు కలపడంతో 718, 719 మార్కులు వచ్చాయని ఎన్ టీ ఏ తెలిపింది. అయితే ఈ విషయమై కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల పేపర్లు రీ వాల్యూయేషన్ చేయాలని కోరారు. మరికొందరు పరీక్షను రద్దు చేయాలని కోరారు. తొలుత ఈ ఆరోపణలను ఎన్ టీ ఏ తోసిపుచ్చింది. ఆ తర్వాత ప్రశ్నాపత్రం లీకైందని ఒప్పుకుంది.
నీట్ యూజీ 2024 పరీక్షలో గ్రేస్ మార్కులు ఎందుకు కలిపారు?
నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్ష నిర్వహణలో కొన్ని పరీక్షా కేంద్రాల్లో అవకతవకలు జరిగినట్టుగా తొలుత ఆరోపణలు వచ్చాయి. రాజస్థాన్ సవాయ్ మాధోపూర్ ఆదర్శ్ బాలికల స్కూల్ లో హిందీ మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ అందింది. అయితే కొందరు విద్యార్థులు ప్రశ్నాపత్రంతో బయటకు వెళ్లినట్టుగా ఎన్ టీ ఏ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే అప్పటికే పరీక్ష మొదలైందని, ప్రశ్నాపత్రం లీక్ కాలేదని ఎన్ టీ ఏ వివరణ ఇచ్చింది.
మరో వైపు పరీక్ష రాసేందుకు సమయం సరిపోలేదనే కారణంతో 1563 మంది విద్యార్థులకు ఎన్ టీ ఏ గ్రేస్ మార్కులను కలిపింది. అందుకే వీరికి 718, 719 మార్కులు వచ్చినట్టుగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఫిజిక్స్ లో ఒక ప్రశ్నకు రివిజన్ మార్కులతో మరో 44 మందికి 720 మార్కులు వచ్చాయని ఎన్ టీ ఏ వివరించింది. గ్రేస్ మార్కుల అంశంపై విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థులకు ఈ నెల 23న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 50 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. ఈ ఫలితాలను ఈ నెల 30న ఫలితాలను విడుదల చేయనున్నట్టుగా ఎన్ టీ ఏ తెలిపింది. నీట్ పరీక్షను రద్దు చేయాలని పలు రాష్ట్రాల విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ పై జూలై 8న విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
నీట్ ప్రవేశ పరీక్షలో 67 మందికి టాప్ ర్యాంకులు రావడం ఇదే తొలిసారి
నీట్ ప్రవేశ పరీక్షకు 24 లక్షల మంది ధరఖాస్తు చేసుకొన్నారు. అయితే సుమారు లక్ష మందికిపైగా విద్యార్థులు పలు కారణాలతో పరీక్ష రాయలేదు. కానీ, ఈసారి పరీక్ష రాసిన వారిలో ఎక్కువ మందికి టాప్ ర్యాంకులు రావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక్క కరెక్ట్ జవాబుకు నాలుగు మార్కులిస్తారు. తప్పు సమాధానానికి ఒక్క మార్కును కలిపి ఐదు మార్కులను తగ్గిస్తారు. మొత్తం 180 మార్కుల పేపర్లో ఒకరిద్దరికి మినహా అసాధారణంగా 67 మందికి టాప్ ర్యాంకులు రావడం సాధ్యం కాదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గతంలో వచ్చిన ఫలితాలను కూడా వారు గుర్తు చేస్తున్నారు. 2023లో ఇద్దరికి మాత్రమే 720 మార్కులు వచ్చాయి. 2022లో ఒక్కరికే టాప్ మార్కులు వచ్చాయి. 2021లో ముగ్గురికి, 2020, 2019 లో ఒక్కొక్కరికి 720 మార్కులు వచ్చాయి.
నీట్ యూజీ 2024 ప్రశ్నపత్రం లీక్ పై సీబీఐ విచారణ, అరెస్టులు
నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకైనట్టుగా ఆరోపణలతో ఇండియా కూటమి నాయకులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. గుజరాత్ పంచమహ జిల్లాలోని ఓ పరీక్ష కేంద్రంలో ఖాళీ ఎమ్మార్ షీట్ ఇచ్చి వెళ్లాలని కొందరు విద్యార్థులకు ఇన్విజిలేటర్లు చెప్పారని పోలీసుల విచారణలో తేలిందని మీడియా రిపోర్ట్ చేసింది. తొలుత ప్రశ్నాపత్రం లీక్ కాలేదని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం చివరికి ఒక పరీక్షా కేంద్రంలో ప్రశ్నాపత్రం లీకైందని తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది కేంద్రం. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది.
ఈ కేసులో జార్ఖండ్ కు చెందిన జర్నలిస్ట్ ఎండి జమాలుద్దీన్ అరెస్టయ్యారు. పేపర్ లీక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హజారిబాగ్ ఓయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్ ఈషానుల్ హక్ కు సహాయం చేశారనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో స్కూల్ వైస్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ ఆలం ను కూడా సీబీఐ అరెస్ట్ చేసింది.
నీట్ యూజీ-2024 ప్రశ్నాపత్రం లీక్ కేసులో పట్నాలో మనీష్ ప్రకాష్, ఆశుతోష్ కుమార్ లను అరెస్ట్ చేశారు. ఉత్తరాఖండ్ కు చెందిన జి.గంగాధర్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గుజరాత్ గోద్రా జై జలరాం స్కూల్ ప్రిన్సిపల్ పురుషోత్తం శర్మ, ఇదే స్కూల్ కు చెందిన తుషార్ భట్, ఆరిఫ్ వరోహ, విబోర్ ఆనంద్ సింగ్ లను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
ఈ కేసులో 19 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొన్నారు. పరంజిత్ సింగ్ అలియాజ్ బిట్టు, భల్ దేవ్ కుమార్ అలియాస్ చింటూ, ప్రశాంత్ కుమార్ అలియాస్ కాజు, అజిత్ కుమార్, రాజీవ్ కుమార్ అలియాస్ కారు, పింక్ కుమార్ లను ఆయా రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విచారించారు. రాజస్థాన్ లోని జెఎన్టీయూ మెడికల్ కాలేజీకి ఎనిమిది మంది మెడికల్ విద్యార్థులను ముంబై పోలీసులు విచారించారు. వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
పేపర్ లీక్ మాస్టర్ మైండ్ సంజీవ్ కుమార్?
నీట్ యూజీ 2024 పేపర్ లీక్ వెనుక సంజీవ్ కుమార్ ముఖియా మాస్టర్ మైండ్ అని బీహర్ ఆర్ధిక నేరాల విభాగం అనుమానిస్తోంది. బీహర్ లో ఈ కేసును తొలుత బీహర్ ఆర్దిక నేరాల విభాగం దర్యాప్తు చేసింది. టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ తో పాటు పలు పేపర్ల లీకేజీలో అతని ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో సంజీవ్ కుమార్ ముఖియా ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. మరో వైపు సంజీవ్ కుమార్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
పేపర్ లీక్ కేసులో అతను గతంలో రెండుసార్లు అరెస్టయ్యారు. దశాబ్దాం కిందట బీహర్ లో నిర్వహించిన బ్లాక్ లెవల్ పరీక్ష పేపర్ లీక్ కేసులో అరెస్టయ్యారు. 2016లో ఉత్తరాఖండ్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో ఆయనను అరెస్టు చేశారు. ఈ ఏడాది బీహర్ టీచర్ రిక్రూట్ మెంట్ కేసులో సంజీవ్ కుమార్ కొడుకు శివ అరెస్టయ్యారు. నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో అరెస్టయిన బల్ దేవ్ కుమార్ సంజీవ్ కుమార్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది.
నీట్ యూజీ 2024 రీ టెస్ట్ ఫలితాల విడుదల
నీట్ యూజీ 2024 పరీక్షలో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు గత నెలలో సుప్రీంకోర్టు సూచన మేరకు ఎన్‌టీఏ మళ్లీ పరీక్ష నిర్వహించింది. 1563 మందికి పరీక్ష నిర్వహిస్తే 813 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఈ ఫలితాను జూలై 1న విడుదల చేశారు. ఈ ఫలితాల మేరకు విద్యార్థుల ర్యాంకులను కూడా సవరించింది.
గతంలో కూడా నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహణపై ఆరోపణలు వచ్చాయి. ప్రశ్నాపత్రాలను లీక్ చేసినవారిని కఠినంగా శిక్షించాలని, అప్పుడే ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయని విద్యార్థులు, తల్లితండ్రులు అంటున్నారు.