మైక్రోసాఫ్ట్ విండోస్ టెక్నికల్ సమస్య ఏంటి... దీనివల్ల ఏయే సేవలు ఆగిపోయాయి?

టెక్నికల్ సమస్యలతో మైక్రోసాఫ్ట్ 365 అప్లికేషన్ సేవలపై ప్రభావం చూపింది.

Update: 2024-07-19 14:15 GMT

మైక్రోసాఫ్ట్ విండోస్ టెక్నికల్ సమస్య ఏంటి... దీనివల్ల ఏయే సేవలు ఆగిపోయాయి?

మైక్రోసాఫ్ట్ విండోస్ లో జూలై 19న టెక్నికల్ సమస్య తలెత్తింది. కంప్యూటర్లలోని స్క్రీన్లపై బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కన్పించింది. దీంతో సిస్టమ్ లు షట్ డౌన్ అయ్యాయి. విండోస్ సరిగా లోడ్ కాలేదు. క్రౌడ్ స్ట్రయిక్ అప్ డేట్ కారణంగానే ఈ సమస్య ఏర్పడిందని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.


 క్రౌడ్ స్ట్రయిక్ అంటే ఏంటి?

క్రౌడ్ స్ట్రయిక్ ఓ సైబర్ సెక్యూరిటీ కంపెనీ. ఇది అమెరికాలో ఉంది. ప్రభుత్వ సంస్థలు, విమానాశ్రయాలు, బ్యాంకుల వంటివి క్రౌడ్ స్ట్రయిక్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగిస్తాయి. 2011లో ఈ కంపెనీ ప్రారంభమైంది. అయితే ప్రభుత్వ సంస్థలు, హై ప్రొఫైల్ సైబర్ భద్రతపైనే క్రౌడ్ స్ట్రయిక్ సంస్థ దృష్టి పెట్టింది. అమెరికాలోని కొన్ని సంస్థలపై హ్యాకర్లు దాడులు చేసిన సమయంలో ఈ సంస్థ ప్రభుత్వంతో కలిసి పనిచేసింది. క్రౌడ్ స్ట్రయిక్ అప్ డేట్ కారణంగానే టెక్నికల్ సమస్య తలెత్తిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. క్రౌడ్ స్ట్రయిక్ ఉపయోగించే ఫాల్కన్ సెన్సార్ లో లోపం కారణంగా మైక్రోసాఫ్ట్ లో అంతరాయం ఏర్పడిందని నివేదికలు చెబుతున్నాయి.


 మైక్రోసాఫ్ట్ 365 అప్లికేషన్ సేవలపై ప్రభావం

టెక్నికల్ సమస్యలతో మైక్రోసాఫ్ట్ 365 అప్లికేషన్ సేవలపై ప్రభావం చూపింది. మైక్రోసాఫ్ట్ టీమ్స్, మైక్రోసాఫ్ట్ 365 అడ్మిన్ సెంటర్, మైక్రోసాఫ్ట్ పర్వ్య్, వివ ఎంగేజ్, ఒన్ డ్రైవ్ , వన్ నోట్, ఔట్ లుక్, జీబాక్స్ యాప్, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ వంటి యాప్ ల సేవలకు అంతరాయం ఏర్పడిందని సమాచారం. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని మైక్రోసాఫ్ట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.


 విమానాల రద్దు, నిలిచిపోయిన పలు సేవలు

ప్రపంచంలోని అమెరికా, అస్ట్రేలియా, భారత్ సహా ప్రపంచంలోని పలు దేశాల్లో వందలాది విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణీకులు ఎయిర్ పోర్టు్లోనే నిలిచిపోయారు. లండన్ స్టాక్ ఏక్చేంజ్, మెక్ డొనాల్డ్, యుఎస్ ఎయిర్ లైన్స్, ఎల్ఎస్ఇ గ్రూప్ వంటి కొన్ని పెద్ద కంపెనీలు తమ కమ్యూనికేషన్లు, కస్టమర్ సేవలో సమస్యలను నివేదించాయి.


నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ పై ఎలాంటి ప్రభావం లేదన్న ఆశ్విని వైష్ణవ్

భారత్ లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పై ఎలాంటి ప్రభావం చూపలేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ చెప్పారు. మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సమస్యపై కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సంప్రదింపులు జరుపుతుందని ఆయన చెప్పారు.

మైక్రోసాఫ్ట్ లో టెక్నికల్ సమస్యను పరిష్కరించేందుకు టెక్నికల్ సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించారు.

Tags:    

Similar News