Mamata Banerjee: దేశంలో మళ్లీ థర్డ్ ఫ్రంట్ స్వరం
Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలో సన్నాహాలు * పార్టీలను ఏకం చేసే పనిలో శరద్ పవార్
Mamata Banerjee: దేశంలో మళ్లీ థర్డ్ ఫ్రంట్ స్వరం వినిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఫామ్ చేసేందుకు పావులు కదులుతున్నాయి. 2019 ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. చివరకు ఎన్నికలు రాగానే సైలెంట్ అయ్యారు. ఇప్పుడు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. దీనికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శమరశంఖం పూరిస్తున్నారు.
ఇప్పటికే బీజేపీ, కాంగ్రెసేతర నేతలను ఏకం చేసేందుకు శరద్ పవార్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న ఢిల్లీలో శరద్ పవార్‌ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ దీనిపై డీప్ డిస్కర్షన్ చేశారు. ఇక ఈరోజు శరద్‌పవార్ ఇంట్లో ఆయా పార్టీల నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి దాదాపు 15 పార్టీల నేతలను, మేధావులు, కళాకారులను పవార్ ఆహ్వానించారు.
2024 నాటికి మూడో ఫ్రంట్‌ను సిద్దం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం జరుగనుంది. ప్రస్తుత దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులను ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశానికి సంజయ్‌సింగ్, పవన్ వర్మతో పాటు ఎన్సీపీ ఎంపీ వందనా చవాన్, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, సీపీఐ నేత డీ రాజా, సమాజ్‌వాది పార్టీ నేత ఘన్‌శ్యామ్ తివారీ లాంటి నేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.