విభజన చట్టం ప్రకారమే ఏపీ, తెలంగాణకు నీటి పంపిణీ: కేంద్ర జల్‌శక్తి

Water Sharing: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యాల బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లపై కేంద్ర జల్‌శక్తి అధికారులు వివరణ ఇచ్చారు.

Update: 2021-07-16 10:36 GMT

విభజన చట్టం ప్రకారమే ఏపీ, తెలంగాణకు నీటి పంపిణీ: కేంద్ర జల్‌శక్తి

Water Sharing: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యాల బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లపై కేంద్ర జల్‌శక్తి అధికారులు వివరణ ఇచ్చారు. విభజన చట్టం ప్రకారమే ఏపీ, తెలంగాణకు నీటి పంపిణీ జరుగుతుందని తేల్చిచెప్పారు. విస్తృతంగా చర్చించాకే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చామన్న కేంద్ర జల్‌శక్తి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే బోర్డుల పరిధి నిర్ణయించినట్లు తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్లు ఇచ్చేముందు సెంట్రల్ వాటర్ కమిషన్‌ సీడబ్ల్యూసీతోనూ సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు. అలాగే, గెజిట్‌లో ప్రతి పదం, ప్రతి లైన్‌ ఎంతో ఆలోచించాకే రాశామని కేంద్ర జల్‌శక్తి జాయింట్ సెక్రటరీ సంజయ్ తెలిపారు.

మొదటి షెడ్యూల్‌లో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను చేర్చినట్లు తెలిపిన కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులు రెండో షెడ్యూల్‌లో KRMB, GRMBలను చేర్చామన్నారు. అపెక్స్ కౌన్సిల్ పరిధిలోకి కృష్ణా, గోదావరి బోర్డులు రావడంతో ప్రాజెక్టుల దగ్గర కేంద్ర బలగాలను మోహరిస్తామని కేంద్ర జల్‌శక్తి జాయింట్ సెక్రటరీ సంజయ్ ప్రకటించారు.

ఇక, కృష్ణా, గోదావరి బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ట్రాలు సమానంగా భరించాల్సి ఉంటుందని కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారులు తెలిపారు. సెక్షన్ 84 ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైందన్న కేంద్ర జల్‌శక్తి జాయింట్ సెక్రటరీ సంజయ్ ఇందులో కేంద్ర జల్‌శక్తి, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారని గుర్తుచేశారు. 2016 నుంచి పలుమార్లు అపెక్స్ కౌన్సిల్ సమావేశమైనా తుది నిర్ణయం తీసుకోలేకపోయారని, ఇప్పుడు అన్ని అంశాలను సుదీర్ఘంగా చర్చించి గెజిట్స్ ఇచ్చామన్నారు. రెండు రాష్ట్రాలు సమర్పించిన డీపీఆర్స్ మేరకే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News