Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం, అక్కడ తన కుమారుడు లేడన్న కేంద్రమంత్రి

Uttar Pradesh: *ఘటనపై రైతు సంఘాల భగ్గు *నేడు దేశవ్యాప్త నిరసనలు

Update: 2021-10-04 02:58 GMT

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం, అక్కడ తన కుమారుడు లేడన్న కేంద్రమంత్రి

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటు చేసుకుంది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా యూపీలో రైతులు చేపట్టిన ఆందోళన హింసకు దారి తీసింది. రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న అన్నదాతలపైకి కేంద్రహోంశాఖ సహాయమంత్రి కుమారుడు కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు దాడి చేయడంతో ఓ కారులో ఉన్న నలుగురు మృతి చెందారు. నిరసనకారులు రెండు కార్లను తగలబెట్టారు.

అయితే ఘటన సమయంలో తన కుమారుడు వాహనంలో లేడని, అక్కడ ఉన్నవారే తమ పార్టీ కార్యకర్తలను, కారు డ్రైవరును కొట్టి చంపారని కేంద్రమంత్రి ఆరోపించారు. ఈ ఘటనపై రైతు సంఘాలు మండిపడ్డాయి. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా మేజిస్ట్రేట్‌ కార్యాలయాల ఎదుట ఇవాళ ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి. మరోవైపు కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి.

కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ జాతీయాధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, ఆర్‌ఎల్‌డీ నేత జయంత్‌ చౌధురీ, వామపక్ష నేతలు లఖింపుర్‌ ఖేరికి వెళ్లనున్నారు. ఘటన గురించి తెలియగానే కర్షక నేత రాకేశ్‌ టికాయిత్‌తోపాటు హరియాణా, పంజాబ్‌లకు చెందిన రైతులు యూపీకి బయల్దేరారు.

లఖింపుర్‌‌ఖేరి జిల్లాలోని అజయ్‌ మిశ్ర స్వగ్రామమైన బన్బీర్‌పుర్‌లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయనతో పాటు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య హాజరు కావాల్సి ఉంది. అయితే సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులు కేశవ్‌ ప్రసాద్‌ ఎదుట నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. అందుకోసం తికోనియా-బన్బీర్‌పుర్‌ రహదారిపైకి చేరుకున్నారు. ఈ క్రమంలోనే కేశవ్‌ ప్రసాద్‌కు స్వాగతం పలకడానికి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర వాహన శ్రేణితో అటువైపు రాగా రైతులు నల్ల జెండాలు చూపుతూ నినాదాలు చేశారు.

అయితే రెండు కార్లు ఉన్నట్టుండి రైతుల మీదకు దూసుకెళ్లాయి. దీంతో నిరసనకారులు చెల్లాచెదురయ్యారు. మంత్రి కుమారుడి చర్యపై ఆగ్రహించిన రైతులు ఆయన కారుతో పాటు మరో కారును తగలబెట్టారు. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది మరణించారని లఖింపురిఖేరి జిల్లా మేజిస్ట్రేట్‌ తెలిపారు.

రైతులపైకి దూసుకెళ్లిన కారులో తన కుమారుడు ఉన్నారన్న వార్తలను అజయ్‌ మిశ్ర ఖండించారు. ఘటన సమయంలో తాను కానీ, తన కుమారుడు కానీ అక్కడ లేమని చెప్పారు. తామిద్దరం కార్యక్రమ వేదిక వద్ద ఉన్నామన్నారు. రైతుల్లో ఉన్న కొన్ని అల్లరి మూకలే రాళ్లు విసరడంతో కారు తిరగబడిందని, దాని కింద పడి రైతులు మరణించారని చెప్పారు. నిరసనకారులు దాడి చేయడంతో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, కారు డ్రైవరు ప్రాణాలు కోల్పోయారన్నారు. దీంతో వెనుక వాహనం దెబ్బతిందని, రైతులు అందులోని వారిని బయటికి లాగి దాడి చేసి చంపారని పేర్కొన్నారు.

Tags:    

Similar News